Andhra PradeshEast GodavariNews

అతిథి అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

అతిథి అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కోస్తా ఎన్ కౌంటర్, రాజహేంద్రవరం సిటి; విధుల నుంచి తొలగించిన అతిధి అధ్యాపకుల ( గెస్ట్ ఫ్యాకల్టీ ) ను వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీస్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎస్.ఆర్. భార్గవ్, ప్రధాన కార్యదర్శి ఎ.ఎస్.ఎస్. కుమార్, కోశాధికారి విజయ్, ఝాన్సీ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ (అతిథి అధ్యాపకులు) గా పనిచేస్తున్న వారిని అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో కుటుంబాలతో సహా జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణం మళ్లీ తమను ఉ ద్యోగాల్లోకి తీసుకోవడంతో పాటు వేతన స్థాయి పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా అతి తక్కువ వేతన స్థాయి కేవలం రూ 14 వేల 400కు మాత్రమే పని గంటల ఆధారంగా పనిచేస్తున్నామని తెలిపారు. కర్తవ్య నిష్టతో విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్న తమను తొలగించడం దారుణమని వాపోయారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక అల్లాడుతున్న తమకు ఎటువంటి జీవనోపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో అక్కడ పనిచేస్తున్న వారు ఇక్కడ అధ్యాపకులుగా చేరుతున్నారని అందువల్లనే ఇక తమ అవసరం లేదని ఉద్యోగాలు తొలగించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో 568 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారని వారంతా ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. ఏడాదికి 8 నెలలు మాత్రమే తమకు గెస్ట్ ఫ్యాకల్టీగా ఉపాధి లభిస్తుందని ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందన్నారు. అసలు విద్యావ్యవస్థలో గెస్ట్ ఫ్యాకల్టీ అనే వ్యవస్థ ఒకటి ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం తమకు ఆవేదనకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం తమను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు తమ ఇబ్బందులను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసారు. తమకు ఉపాధి కల్పించకపోతే చావే శరణ్యమన్నట్టుగా తమ జీవన ప్రమాణాలు ఉన్నాయని ప్రభత్వం తక్షణం స్పందించాలని వేడుకున్నారు. విద్యాబోధనపై ఆసక్తితోనే అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నామని ఈ విషయాన్ని గ్రహించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో అతిథి అధ్యాపకులు ఎన్వి మాలతి, వై. విజయలక్ష్మి, ప్రియాంక, శ్రీకాంత్, రేవతి, గణేష్, రాంబాబు, సతీష్, రాజ్యలక్ష్మి, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Comment here