Andhra PradeshEast GodavariNews

ఈతకోట వైసిపిలో..ముసలం

ఈతకోట వైసిపిలో..ముసలం
`వైసిపి గ్రామ అధ్యక్షుడు కృష్ణంరాజు ఏకపక్ష విధానాలతో అసమ్మతి రాగం
`కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు
`కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆరోపణలు
`కాపు సామాజిక వర్గంలో పెరుగుతున్న అసహనం
`వైసిపి కార్యకర్తలు..ఇతర పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు సృష్టిస్తున్నారన్న వాదన
`ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా..పట్టించుకోవడం లేదని ఆవేదన
`చక్క దిద్దుతారా.. గాలికి వదిలేస్తారా?

కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరం; కార్యకర్తల కష్టంతోనే.. ఏ పార్టీ అయినా ఉన్నత స్థితికి ఎదుగుతుంది. మరీ ఆ కార్యకర్తలనే విస్మరిస్తే.. వారిపట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే.. ఆ పార్టీకి పతనం తప్పదు. ఈ సూత్రం ప్రజా స్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది. పార్టీలను మోసం చేసే నాయకులు ఉన్నారేమో కానీ.. కార్యకర్తలు లేరు. ఈ మౌలిక సూత్రాన్ని మరిచి.. ఏక పక్ష విధానాలతో వ్యవహరిస్తే.. ఆయా పార్టీలకు కార్యకర్తలు దూరమవుతారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రావులపాలెం నియోజక వర్గం ఈతకోటలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో.. ముసలం బయలుదేరింది. ఇది రోజు రోజుకీ పెరిగి పెద్దదవుతోంది. ఈతకోట గ్రామ పార్టీ అధ్యక్షుడు యు.కృష్ణంరాజు వ్యవహర శైలి.. పార్టీ వర్గాలు, కార్యకర్తల్లో వివాదస్పదమవుతోంది. ఈయను 14 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడి ఉన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఈ సుదీర్ఘ కాలంలో.. ఎన్నికల్లో పార్టీ పెద్దగా విజయం సాధించలేదన్న వాదన ఉంది. సర్పంచ్‌, ఎంపిటిసి తదితర ఎన్నికల్లో ఏనాడు వైసిపి విజయం సాధించలేదన్న విమర్శ ఉంది. స్వయంగా సర్పంచ్‌గా పోటీ చేసి.. పరాజయం పాలైన ఘనత పార్టీ అధ్యక్షడు కృష్ణంరాజు సొంతమని ప్రచారం ఉంది. కాపులకు..కాపులకు.. శెట్టి బలిజలకు..శెట్టి బలిజలకు..గౌడ కులస్తులు.. ఎస్సీ,బిసి ఇలా ఇంకా ఇతర కులాల వారి మధ్య వాళ్లలో వారికే గొడవలు పెడుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ 12 సంవత్పరాల కాలంలో పార్టీ నాయకులకు..కార్యకర్తలకు ఏనాడు మాట సాయం కూడా చేయలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పోలీస్‌ స్టేషన్‌, తహశీల్డార్‌ ఇంకా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని కావాలన్నా.. ఏనాడు కార్యకర్తలకు ఉపయోగపడలేదన్న వాదను ఉంది. ఈ విధంగా ఈతకోట గ్రామంలో పార్టీ అధ్యక్షుడు కృష్ణంరాజు వ్యవహరశైలి.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే తీవ్ర మనస్థాపం కల్గిస్తుందన్న ప్రచారం ఉంది. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా.. తన ఇష్టారాజ్యంగా ముందుకు సాగుతున్న అధ్యక్షుడి తీరు పట్ల అనేక పర్యాయాలు.. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా..ఆయన పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి.. సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చొరవ చూపకపోవడం పట్ల అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది.

రాజులపైనే..మక్కువా?
రావుల పాలెంలో సుమారు 70 వేలకు పైగా కాపు సామాజిక వర్గం ఉంది. ఇక ఈతకోట గ్రామంలోనూ కాపుల సామాజిక వర్గం ఎక్కువగానే ఉంది. అయినా.. కాపుల కన్నా క్షత్రియ సామాజిక వర్గం వారి పట్లే ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎక్కువగా మక్కువ చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈతకోట గ్రామ అధ్యక్షుడు కృష్ణంరాజు ..దశాబ్డ కాలంగా స్థానికంగా నాయకులు,కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా.. రాజమండ్రిలో నివాసం ఉంటున్నా.. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు.ఇక మండలమంతా వెదిరేశ్వరం రాజుల కనుసన్నల్లో .. వారి ఆధిపత్యంలో నడుస్తుందన్న ప్రచారమూ ఉంది. ఈ కారణంగానే ఈతకోట గ్రామ అధ్యక్షుడిగా కృష్ణంరాజు పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా.. ఆయన్ను తొలగించడం లేదన్న చర్చ సాగుతోంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కె.సత్యనారాయణ గృహంలో జరిగిన సమావేశంలో అక్కడకు వచ్చిన కృష్ణంరాజు తనను ఎవరూ ఏమి చేయలేరని..తనకు అడ్డువచ్చిన వారిని అణగదొక్కుతానంటూ హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది. ఇక
క్షత్రియ సామాజిక వర్గం పట్టు బలంగా ఉన్న వెదిరేశ్వరం గ్రామంలో తాజాగా విడుదలైన ఎంపిటిసి ఫలితాల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన దండు వెంకట సుబ్రహ్మణ్య వర్మ పరాజయం పాలయ్యారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. వెదిరేశ్వరంలో రాజుల ఆధిపత్యం ఉన్నా.. ఇక్కడ వైసిపి ఓడిపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతర్గతంగా వైసిపి శ్రేణుల్లో పేరుకుపోయిన అసంతృప్తే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీరుపై..అసహనం
రావులపాలెం నియోజక వర్గంలో కీలకమైన కాపు సామాజిక వర్గం.. అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతుందా? నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసి..ముందుకు నడిపించాల్సిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల ఆవేదన పట్టించుకోవడం లేదా? అసలు ఈతకోట గ్రామంలో బయలుదేరిన ముసలం.. ఎక్కడవరకు వ్యాపిస్తుంది? ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలమే చెబుతుంది. ఈతకోట గ్రామంలో గత దశాబ్డకాలంలో జరిగిన పలు ఎన్నికల్లో వైసిపి పరాజయం పాలవుతున్నప్పటికీ.. ఎందుకు ఇంకా గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణంరాజు పట్ల ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విశ్వాసం, నమ్మకం కనబరుస్తున్నారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోని నాయకులను ఎందుకు పదవుల్లో కొనసాగిస్తున్నారో అర్థంకాని ప్రశ్నగా మారిందని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్డ కాలానికి పైగా పార్టీనే నమ్ముకుని.. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ.. తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ అసమ్మతి మరింత పెరగకుండా.. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రక్షాళనా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. నాయకులు, కార్యకర్తల మనోభావాలలను పరిగణనలోకి తీసుకుని.. వారితో చర్చించి పార్టీ దెబ్బతినకుండా చూడాలని పలువురు నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. మరి ప్రభుత్వ విప్‌ కూడా అయిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. కార్యకర్తల గోడు పట్టించుకుంటారో.. యధావిధిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారో చూడాలి మరీ!

 

Comment here