Andhra PradeshEast GodavariNews

డెంగీ, మ‌లేరియా వ్యాధుల క‌ట్ట‌డికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

డెంగీ, మ‌లేరియా వ్యాధుల క‌ట్ట‌డికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

– వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్‌ను స‌క్ర‌మంగా ఉప‌యోగించాలి

– ఫీవ‌ర్ స‌ర్వేల‌ను క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించాలి

– జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్

జిల్లాలో డెంగీ, మ‌లేరియా వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా నియంత్రించేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో క‌లిసి పంచాయ‌తీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, డివిజ‌న‌ల్ పంచాయ‌తీ అధికారులతో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 163 డెంగీ కేసులు, 82 మ‌లేరియా కేసులు న‌మోద‌య్యాయ‌ని, మ‌లేరియా కేసులు కేవ‌లం ఏజెన్సీ ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమితం కాగా డెంగీ కేసులు జిల్లా వ్యాప్తంగా న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపారు. జిల్లాలో తొలి విడ‌త ఇండోర్ రెసిడ్యుయ‌ల్ స్ప్రే (ఐఆర్ఎస్) కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే పూర్త‌యింద‌నీ, దోమ తెర‌లు కూడా పంపిణీ చేశామ‌ని అయినా కేసులు ఎందుకు న‌మోద‌వుతున్నాయో ప‌రిశీలించి, అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ‌త సంవ‌త్స‌రంతో పోల్చుకుంటే కేసులు త‌క్కువ సంఖ్య‌లో న‌మోదైన‌ప్ప‌టికీ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా దోమ‌కాటు వ‌ల్ల ఈ రెండు వ్యాధులు వ్యాప్తి చెందే అవ‌కాశ‌మున్నందున జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో ఫీవ‌ర్ స‌ర్వేను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని, డెంగీ ప‌రీక్ష‌లను కూడా పెంచాల‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా హాట్‌స్పాట్ ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు, ఫీవ‌ర్ స‌ర్వేల‌ను క‌చ్చిత‌త్వంతో నిర్వ‌హించ‌డం వ‌ల్ల కోవిడ్‌తోపాటు సీజ‌న‌ల్ వ్యాధుల వ్యాప్తిని కూడా అడ్డుకోవ‌చ్చ‌ని, ఫీవ‌ర్ స‌ర్వేలో గుర్తించిన ల‌క్ష‌ణాల‌నుబ‌ట్టి అవ‌స‌ర‌మైతే డెంగీ  ప‌రీక్ష‌లు చేయాల‌ని, ఇందుకోసం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల‌ను కూడా స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. ఎక్క‌డైనా ర‌సాయ‌నాలు అవ‌స‌ర‌మైతే స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. గ‌త అనుభ‌వాల దృష్ట్యా జిల్లాలో అక్టోబ‌ర్ వ‌ర‌కు ఈ వ్యాధులు ప్ర‌బ‌లేందుకు అవ‌కాశ‌మున్నందున రాబోయే రెండు నెల‌ల పాటు అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండి, కేసులను క‌నీస స్థాయికి త‌గ్గించాల‌ని క‌లెక్టర్ ఆదేశించారు.

వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్‌ను స‌క్ర‌మంగా ఉప‌యోగించాలి:పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల మెరుగుద‌ల కోసం రూపొందించిన వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్‌ను స‌క్ర‌మంగా ఉప‌యోగించాలని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ్రామాలు, వార్డుల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్య‌క‌ర్త‌లు.. దోమ‌ల వృద్ధికి అవ‌కాశ‌మున్న నీటి గుంత‌లు, మురుగు నీరు నిలిచే ప్రాంతాలు, అప‌రిశుభ్ర ప‌రిస‌రాల‌ను గుర్తించి వాటిని ఫొటోలు తీసి యాప్‌లో న‌మోదు చేయాల‌న్నారు. ఈ యాప్‌లో న‌మోదైన స‌మ‌స్య‌ల‌ను పంచాయ‌తీ, వార్డు కార్య‌ద‌ర్శులు త‌క్ష‌ణం ప‌రిష్క‌రించి మ‌ళ్లీ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల‌ని ఆదేశించారు. యాప్‌లో న‌మోదైన అంశాల ప‌రిష్కారంలో ఎట్టిప‌రిస్థితుల్లోనూ పెండింగ్ ఉండ‌కూడ‌ద‌ని, ఇందుకోసం జిల్లా పంచాయ‌తీ కార్యాల‌యంలో ప్ర‌త్యేక సెల్‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఫ్రైడే-డ్రై డే, ఫాగింగ్‌, స్ప్రేయింగ్, గంబూసియా చేప‌ల విడుద‌ల‌, ఆయిల్ బాల్స్ వేయ‌డం వంటి యాంటీ లార్వాల్ ఆప‌రేష‌న్స్‌ను (ఏఎల్వో) స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి దోమ‌ల నిర్మూల‌నకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఏదైనా ప్రాంతంలో డెంగీ కేసు న‌మోదైతే ఆ ప్రాంతంలో ఎనిమిది వారాల పాటు క‌చ్చితంగా ఏఎల్వో చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

ప్ర‌జ‌ల్లో అవగాహ‌న క‌ల్పించాలి: –  డెంగీ, మలేరియా కేసుల క‌ట్ట‌డికి ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని.. ఇందుకోసం మొబైల్ టెక్స్ట్‌, వాయిస్ మెసేజ్‌లు; ఫోన్‌కాల్స్‌; క‌ర‌ప‌త్రాలు, పోస్ట‌ర్లు త‌దిత‌రాలను ఉప‌యోగించాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌కు సూచించారు. ఇళ్ల‌లో దోమ‌ల నిర్మూల‌న‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ఇందుకోసం గ్రామ‌, వార్డు వాలంటీర్లు, సచివాల‌య సిబ్బందిని స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై క్షేత్ర‌స్థాయిలో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, రీజ‌న‌ల్ మ‌లేరియా ఆఫీస‌ర్ డా. సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రి, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, జిల్లా మ‌లేరియా ఆఫీస‌ర్ పీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఎస్‌వో డా. నాగ‌భూష‌ణం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comment here