Andhra PradeshEast GodavariNews

తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించిన దృశ్యం….

విద్యారంభం కరిష్యామి…!
తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించిన దృశ్యం….

కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : విద్యకు అధిదేవత సరస్వతీదేవి. శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు,మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం అమ్మవార్లను మహాసరస్వతీదేవిగా అలంకరించారు. పట్టణంలోని 17వ వార్డులోని విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని, వీకర్స్‌ కాలనీ లోని గాయత్రీ అమ్మవారిని, పుర దేవత బలుసులమ్మవారిని, చిన్నవంతెన సమీపంలోని శంకరమఠంలో వేంచేసియున్న సర్వమంగళాదేవిని, రామచంద్రరావుపేట శ్రీకృష్ణయోగా ధ్యాన మందిరంలోని చింతామణెమ్మవారిని, ముత్యాలంబపురంలోని శ్రీముత్యాలమ్మవారిని మహాసరస్వతీదేవిగా అలంకరించారు. ఈ సందర్బంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆయా ఆలయ ప్రాంగణాల్లో చిన్నారులతో అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, సరస్వతీ పూజలను నిర్వహించారు. కాగా, పలువురు దంపతులు పీఠలపై కూర్చొని అమ్మవార్లకు కుంకుమార్చనలు జరిపారు. ఆయా ఆలయ కమిటీలు భక్తులకు సౌకర్యాలు కల్పించాయి. కాగా, వీరంపాలెం శైవక్షేత్రంలోని శ్రీబాలాత్రిపురసుందరీ అమ్మవారిని కాత్యాయని అమ్మవారిగా అలంకరించి పూజలందించారు.

వీరంపాలెంలో అక్షరాభ్యాసాలు :
మండలంలోని వీరంపాలెం శైవక్షేత్రంలోని శ్రీమేధాసరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాసాలు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేధాసరస్వతీ నిలయమైన ఏకైక ఆలయం కావడంతో వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు తమ బిడ్డలతో ఇక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సుమారు 600మంది పైబడి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి తెలిపారు. చిన్నారులకు పూజాద్రవ్యాలు, విద్యాసామాగ్రిని ఉచితంగా అందజేశామన్నారు. చిన్నారులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.

Comment here