Andhra PradeshEast GodavariNews

దళితులకు సంక్షేమ పథకాలను కొనసాగించాలి

దళితులకు సంక్షేమ పథకాలను కొనసాగించాలి
తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైన దాసరి కృష్ణవేణికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న దృశ్యం…..
తాడేపల్లిగూడెంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : దళితులకు గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల మల్లిఖార్జునరావు (బాబ్జీ) అన్నారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎస్సీ సెల్‌ సమావేశం ముప్పిడి సురేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ దళిత విద్యార్థులు ఉన్నత విద్యావంతులు కావాలనే ఆలోచనతో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దాన్ని నేటి వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిందని దుయ్యబట్టారు. పేద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో రాణించాలని పెట్టిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఎత్తివేయడంతో పాటు, భూమి కొనుగోలు పథకం, కులాంతర వివాహాల ప్రోత్సాహం, ఎస్సీ, ఎస్టీ భూములు స్వాధీనం, సబ్‌ ప్లాన్‌ నిధులు రద్దు చేసి పప్పు బెల్లం పెడుతుందన్నారు. విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేసే పథకాలను రద్దు చేసిందన్నారు. విద్యాపరంగా దళితులను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తోందన్నారు.ఈ విషయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళే బాధ్యత మనపై ఉందన్నారు.నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌ మాట్లాడుతూ అన్నిగ్రామాల్లో పర్యటించి ఎస్సీలను చైతన్యపరుస్తామన్నారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు పీతల సత్యనారాయణ, కె.పెంటపాడు ఎమ్పీటీసీ పొట్ల ఏడుకొండలు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మెరిపో సంతోష్‌రావు, తెలుగు యువత అధ్యక్షుడు కండెల్లి సందీప్‌, న్యాయవాది చెప్పుల వాసు, ఏలూరి జగదీష్‌, పెనుమాక రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నిరసన కార్యక్రమ :
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ కార్యాలయంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఒక లేఖ రాయనున్నట్టు తెలిపారు. సాగులో ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులను ఆదుకునే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రైతు నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి మాట్లాడుతూ వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోయిన నేపథ్యంలో రైతాంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు మద్దిపాటి సత్యనారాయణ, పీతల సత్యనారాయణ, బుద్ధన ధనరాజు, చవల వినాయకుడు, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, తెలుగుదేశం నాయకులు నల్లమిల్లి చినగోపిరెడ్డి, ముప్పిడి రమేష్‌, చెప్పుల వాసు, పొట్ల ఏడుకొండలు, మెరిపో సంతోషరావు, కండెల్లిసందీప్‌, శీలి వెంకటాచలం, రాకేష్‌, ఏలూరి జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Comment here