Andhra PradeshEast GodavariNews

దివాళా దిశగా..ఆంధ్రప్రదేశ్‌

దివాళా దిశగా..ఆంధ్రప్రదేశ్‌
`వచ్చే మార్చినాటికి మరింత దిగజారనున్న ఆర్థిక పరిస్థితి
`ఎఫ్‌ఆర్‌బిఎం హద్దులు దాటి 6 లక్షల కోట్ల అప్పులు
`అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులు తనఖాలు
`పోలవరం ప్రాజెక్టు కాదు.. బ్యారెజ్‌
`పోలవరం ప్రాజెక్టుకు రూ.4068 కోట్లు ఇచ్చేదే లేదంటు కేంద్రం కొర్రీలు
`ఈస్టిండియా కంపెనీలా.. దేశ సంపదను కార్పోరేట్లకు కట్టబెడుతున్న మోడీ సర్కార్‌
`మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ దయనీయమైన స్థితిలోకి జారుకుందని.. 1956 తర్వాత ఈనాటి పరిస్థితి ఏనాడు చూడలేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్‌ పేర్కోన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇటీవల కాలం వరకు పెట్టే జివోలను పెట్టడం లేదని.. అంటే ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండా చూడటం అంటే ఆ ప్రభుత్వం పతనం దిశగా నడుస్తున్నట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.పారదర్శకత అనేది లేకుండా.. ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. శనివారం రాజమండ్రిలోని స్థానిక ప్రకాశం నగర్‌ ధర్మంచర కమ్యూనిటీ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఏపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని..వివిధ కార్పోరేషన్‌71,761 కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిరంతరం ఢల్లీిలోనే ఉంటూ అందరిని బ్రతుమాలుతూ మిగిలిన రాష్ట్రాల కన్నా మరో 20 వేల కోట్ల రూపాయలను అధికంగా అప్పు తీసుకొచ్చారన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం ప్రకారం రాష్ట్ర జిడిపిలో 3 శాతం మాత్రమే అప్పులుగా తీసుకోవలసి ఉందని.. అయితే కేంద్రం కరోనా వల్ల ఇచ్చిన వెసులు బాటుతో ఇది 5 శాతానికి పెరిగిందన్నారు. దీనిద్వారా తీసుకు వచ్చిన అప్పు మరో 3.50 లక్షల కోట్ల రూపాయలని అన్నారు. పాత అప్పులు 90 వేల కోట్ల రూపాయలను కలుపుకుంటే..మొత్తం 6 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంపై అప్పు ఉందన్నారు. గతంలో అమరావతిని తాకట్టు పెడుతూ.. నాటి సిఎం చంద్రబాబు ముంబాయిలో 2 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకువస్తేనే.. నిలదీశామన్నారు. నేడు జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ దొరికితే అక్కడ తనఖాలు పెట్టి అప్పులు చేసేస్తుందన్నారు. దీనిలో భాగంగానే విశాఖ పట్నంలోని పలు ప్రభుత్వ ఆస్తులను 2500 కోట్లకు తనఖా పెట్టి అప్పులు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపిలోపి పలు మున్సిపాలిటీల్లో తాము చెప్పే సంస్కరణలను అమలుచేస్తే రాష్ట్ర జిడిపిలో కొంత మొత్తాన్ని అప్పుగా ఇస్తామని చెబుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెట్టడం..పన్నులు పెంచాడం..వన్‌ నేషన్‌`వన్‌ రేషన్‌ కార్డుకు అంగీకరిస్తే కొంత మొత్తాన్ని అప్పుగా ఇస్తామని కేంద్రం మెలిక పెట్టిందన్నారు. దీనికి దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలే ఒప్పుకోలేదని.. పక్కనే ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఒప్పుకోలేదన్నారు.అయితే జగన్‌ మాత్రం ఏమాత్రం వ్యతిరేకించ కుండా ఒప్పేసుకున్నారన్నారు. వీటివల్ల సుమారు 45 వేల కోట్ల రూపాయలు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని మించి రాష్ట్రానికి అప్పులుగా అందుతున్నాయన్నారు. ఈ మొత్తం 6 లక్షల కోట్లకు వడ్డీ 7 శాతం చొప్పున ఏడాదికి 42 వేల కోట్ల రూపాయలను వడ్డీలుగా చెల్లించాల్సి వస్తుందన్నారు.ఈ విధంగా రాష్ట్రం అప్పుల ఊబిలోకి

కూరుకుపోతుందన్నారు. పండోరా పేపర్స్‌ విషయంలో సిఎం జగన్‌పై మాజీ సిఎం చంద్రబాబు తీవ్రమైన అరోపణలు చేస్తే.. వెంటనే ప్రభుత్వ సలహదారు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారన్నారు. అటువంటిది.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని..రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని ప్రతిపక్షాలు, పత్రికలు అంటుంటే.. ఎందుకు ఖండిరచడం లేదని నిలదీశారు. అంటే.. ఈ ఆరోపణల్లో నిజం ఉంది కాబట్టే ఖండిరచడం లేదన్నారు.
కేంద్ర సంస్కరణలు అమలుచేస్తే.. 60 శాతం రేషన్‌ కార్డులు హుళక్కేనని ఉండవల్లి అన్నారు. ఇప్పటికే జనాల్లో ఈ విషయమై తీవ్రమైన భయాందోళన నెలకొందన్నారు.
అప్పుల ఊబిలోంచి బయటపడే ప్రయత్నమే చేయడం లేదని.. ఇంతమంది ఐఎఎస్‌లు, సలహాదారులు ఉండి ఏం చేస్తున్నారన్నారు. అప్పుల కోసం వెంపర్లాడటం తప్పా. ఇదే ఆర్థిక పరిస్థితి ఉంటే.. మార్చి వరకు నడవడమే అతికష్టమని.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే జీతాలు సక్రమంగా ఇవ్వలేక పోతున్నారని.. కాంట్రాక్టర్లకు చంద్రబాబు హయాంలో 25 వేల కోట్లు.. ఈ రెండేళ్లలో 65 వేల కోట్లు కలిపి.. మొత్తం రూ.90 వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం దివాళా తీయడం అంటూ వినడం ఎక్కడా వినలేదని.. కానీ ఏపిలో ఆస్తులు కన్నా అప్పులు పెరిగిపోయే పరిస్థితితో దివాళా తీసే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ప్రభుత్వాలు అప్పుల కోసం ఎగబడటం సరికాదన్నారు. ఇప్పటికైనా సిఎం జగన్‌ ప్రజలకు ధైర్యం చెప్పాలని.. అప్పులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని ఉండవల్లి పేర్కోన్నారు. సిఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలన్నీ ఎక్స్‌గ్రేషియాలా ఉండాలే తప్పా.. పనులు లేకుండా ప్రజలు సోమరి పోతుల్లా మారిపోకుండా..కాంట్రాక్టర్లు పారిపోయే పరిస్థితి ఉండకూడదన్నారు. జగన్‌కు కావలసిన కాంట్రాక్టర్లే పనులు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. సామాన్య ప్రజలకు కాదు.. మేధావులు, జర్నలిస్టులకు సైతం ప్రభుత్వం బయటపడుతుందన్న నమ్మకం కల్గడం లేదన్నారు. మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయంలో 76,536 కోట్ల అప్పు చేసినా.. చాలా పరిణతితో పరిపాలన సాగించారన్నారు. ఖజానాలో నిండుగా డబ్బులు ఉన్నాప్పుడే.. పథకాలు అమలు చేస్తానని ఆ తర్వాత వచ్చిన రోశయ్య ఖరాఖండిగా చెప్పారన్నారు. రోశయ్య హాయంలో రూ.25,565 కోట్లు, కిరణ్‌ కుమార్‌ రెడ్డిల హయాంలో రూ.45,949 కోట్లు అప్పులు తెచ్చారన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రాష్ట్రం అప్పులు లక్షా 48,050 కోట్లు ఉన్నాయన్నారు.విభజన చట్టంలో భాగంగా కేంద్రం రూ.86,340 కోట్లు ఇచ్చిందన్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు 1,53,513 కోట్లు కలిపారు.జగన్‌ రెండేళ్లలో 1,45,600 కోట్లు అప్పు చేసారు. రిజర్వ్‌బ్యాంకు ద్వారా ప్రభుత్వం తీసుకున్న రుణం. ఇవి కాకుండా వివిధ కార్పోరేషన్‌ల మీద 71,761 కోట్లు అప్పుగా తీసుకువచ్చారు. ఇవన్నీ కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని..వీటికి వడ్డీలే 42 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసారు.
ఈస్టిండియా కంపెనీలా.. మోడీ సర్కార్‌
కేంద్రంలోని మోడీ సర్కార్‌పైనా ఉండవల్లి విమర్శలు గుప్పించారు. ఈస్టిండియా కంపెనీ మాదిరిగా బిజెపి ప్రభుత్వం మారిందని మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిగా కార్పోరేట్‌ కంపెనీలకు అమ్మేస్తున్నారని..పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్‌ బండ ధరలు విపరీతంగా పెంచేసారన్నారు. మోడీ 2021 నాటికి ప్రధాని మోడీ సంవత్సరానికి సరాసరిన 39,431 కోట్ల రూపాయలు విదేశీ అప్పులు చేసారన్నారు. వివిధ దేశాలు, ప్రపంచ బ్యాంకు నుంచి చేసిన అప్పులు ఇవన్నారు.గత 67 ఏళ్లలో ఆనాటి ప్రభుత్వాలు ఏడాదికి చేసిన అప్పులు కేవలం 6వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. మోడీ పేరుతో వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ అబద్దాలేనని ఉండవల్లి చెప్పారు. దేశాన్ని మొత్తం అమ్మకానికి మోడీ పెట్టేసారన్నారు. ఎన్నికల సమయానికి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి..హిందూ మతం పేరుతో ఓట్లను కొల్లగొట్టి గెలిచేద్దామని మోడీ భావిస్తున్నారని విమర్శించారు. మోడీ కన్నా ముందు ప్రధానులుగా చేసిన మన్మోహన్‌ సింగ్‌, వాజ్‌పేయి, ఇంకా పాతతరంలో లాల్‌ బహదుర్‌ శాస్త్రి,జవహర్‌లాల్‌ నెహ్రూ వంటివారంతా అవినీతి పరులేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం..దేశంలోని సంపదనంతా ఈస్టిండియా కంపెనీ వారిలా అమ్మేస్తారని అన్నారు. కరోనా సమయంలో దేశంలోని ప్రజలు, మ నందరి ఆస్తులు తగ్గిపోయాయి కానీ.. అంబానీ, ఆదానీల ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయన్నారు. దేశంలో కేంద్రాన్ని నిలదీసే ప్రతిపక్షమే లేదన్నారు. ఏపి వరకు వచ్చేసరికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బిజెపితో కలిసే ‘పోయారని’ అన్నారు. జగన్‌, చంద్రబాబులు బహుశ కేసుల భయంతో ఏమి అడగలేని స్థితిలో ఉన్నారన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దళిత బంధుపైనా ఉండవల్లి సునిశిత విమర్శలు చేసారు.
ఈ సమావేశంలో అల్లుబాబి, అచ్యుత దేశాయి తదితరులు పాల్గొన్నారు.

 

 

Comment here