Andhra PradeshEast GodavariNews

దుర్గమ్మ ఆలయం కోసం..పోరాటం

దుర్గమ్మ ఆలయం కోసం..పోరాటం
`బిజెపి నాయకుడు బి.రామచంద్రరావు ఫిర్యాదుతో లోకాయుక్త ఆదేశాలు
`వాస్తవ పరిస్థితులను దాచి.. పంచాయతీ అధికారుల రిపోర్టులు
`దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డు తొలగించేందుకు అధికారుల అత్యుత్సాహం
`అర్థ శతాబ్ద కాలంగా..దుర్గమ్మ తల్లి ఆలయంతో భక్తులకు అనుబంధం
`లోకాయుక్త ఆదేశాలు..పంచాయతీ అధికారుల నోటీసులతో ఆందోళన
`ప్రజలు,భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా ఇవేం చర్యలు అంటూ ఆగ్రహం
`బిజెపి అగ్ర నాయకులకు తప్పుడు సమాచారం
`తమ పార్టీకీ సంబంధం లేదని..రూరల్‌ అధ్యక్షుడు యానాపు యేసు ప్రకటన
`ఆలయం జోలికి వస్తే..ఉద్యమం తప్పదంటున్న భక్తులు, స్థానిక ప్రజలు
`కాతేరు దుర్గానగర్‌లో మొదలైన.. ప్రజా పోరాటం
వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. అహంకారంతో అడుగులు వేస్తే.. దాని ఫలితాలు చేదుగా ఉంటాయి. అబద్దాలతో..లోకాయుక్త వంటి న్యాయ సేవా సంస్థలను తప్పుదోవ పట్టించవచ్చేమో కానీ.. నిజాలను,న్యాయాన్ని కాదు. ఈ సత్యం మరిచి.. రాజమండ్రి రూరల్‌లో ఓ జాతీయ పార్టీ నాయకుడు తన కారు పార్కింగ్‌ కోసం స్థానికంగా ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డు కూల్చివేతకు పన్నిన పన్నాగం..అభాసుపాలయింది. స్థానిక ప్రజలు, భక్తుల మనోభావాలను గాయపరిచిన ఈ ఉదంతంపై
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం.(జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ చేసేది మంచి పని అయితే.. పదిమంది హర్షిస్తారు. అవసరమైతే..అండగా నిలుస్తారు. అలాకాకుండా..తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం..ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రజల మనోభావాలతో ఆటలాడుకుందామంటే.. తిరగబడతారు. అందులోనూ.. తాము అమిత భక్తి శ్రద్దలతో పూజించే దేవుళ్లు.. ఆలయాల జోలికి వస్తే మాత్రం.. కొదమ సింగాల్లా విరుచుకు పడతారు. అన్యాయంపై.. పంజా విసురుతారు. సరిగ్గా ఇదే జరుగుతుంది.. రాజమండ్రి రూరల్‌ కాతేరు గ్రామ పంచాయతీ పరిథిలోని దుర్గా నగర్‌లో. ఈ ప్రాంతంలో సుమారు 50 సంవత్సరాల క్రితం బత్తుల శ్రీదేవి పూర్వీకులు.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూల పుటమ్మ ఆ కనక దుర్గమ్మ తల్లి గుడిని నిర్మించారు. బత్తుల శ్రీదేవి కుటుంబ సభ్యులు నిర్మించినా.. ఆ ప్రాంత ప్రజలకు ఈ గుడితో అనుబంధం ఏర్పడి.. భక్తి అనే పారవశ్యంలో ఓలలాడిరచేలా చేసింది. ప్రతీ ఏటా ఈ గుడిలో దసరా ఉత్సవాలతో పాటు..నిత్య పూజలు, పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంత మహిళలు.. తమ కుటుంబాలు చల్లగా ఉండాలని.. సుఖ సంతోషాలతో జీవించాలని దుర్గమ్మ తల్లిని వేడుకుంటారు. దుర్గానగర్‌లో వీధికి చివరన.. ఎవరికి ఏవిధమైన ఇబ్బంది కల్గించని విధంగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి అంటే అందరికీ ఎంతో ఇష్టం. అటువంటి అమ్మవారి ఆలయం ముందు భాగంలో… భక్తుల సౌకర్యార్థం వేసిన చిన్న పాటి షెడ్డు.. అక్రమ నిర్మాణం అంటూ స్థానికంగా ఉండే బిజెపి నాయకుడు బి. రామచంద్రరావు లోకాయుక్తలో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుతో..లోకాయుక్త కాతేరు పంచాయతీ అధికారులకు నోటీసులు జారీ చేయడం.. సర్వేయర్‌ స్థానిక ప్రజలను ఎవరిని పిలవకుండా సర్వే చేసేయడం.. తనకు తోచింది రాసేసి రిపోర్టు ఇచ్చేయడం.. ఆ రిపోర్టును లోకాయుక్తకు పంపడం.. జరిగిపోయాయి. లోకాయుక్తకు ఏం తెలుసు పాపం.. ఎక్కడో రాజమండ్రి రూరల్‌ కాతేరులోని దుర్గానగర్‌లో పరిస్థితి?.. వెంటనే ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశాలు జారీచేసేసింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా డిపిఓ, కాతేరు పంచాయతీ సెక్రటరీలకు నోటీసలు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతంలో.. రగడ మొదలైంది. అసలు ఎవరికి అడ్డులేని దుర్గమ్మ తల్లి ఆలయం.. పాపం బిజెపి నాయకుడు బి. రామచంద్రరావు గారికి ఎందుకు అడ్డు వచ్చిందో.. అది అక్రమ నిర్మాణంగా ఎందుకు అనిపించిందో.. ఆయనగారే చెప్పాలి. అసలు ఆ గుడి జోలికి వెళ్లాలని ఎందుకు ఆలోచన కల్గిందో.. ఆయనే వివరించాలి.
ఆందోళనలు..పోరాటం
కాతేరు గ్రామ పంచాయతీని ఉద్దరించాలని ఏమైనా కంకణం కట్టుకుంటే.. గ్రామంలోని అక్రమ నిర్మాణాలన్నింటిపైనా లోకాయుక్తలో వెయ్యాలి. అంతేకానీ.. ఎవరికి ఏవిధమైన అడ్డులేని.. దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డు.. దీనిపక్కనే ఉన్న అపార్టుమెంటు మెట్లు మాత్రమే ఎందుకు అడ్డువచ్చాయో.. లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన బిజెపి నాయకుడు బూరా రామచంద్రరావే చెప్పాలని స్థానిక ప్రజలు, భక్తులు నిలదీస్తున్నారు. దుర్గమ్మ తల్లి గుడి షెడ్డును తొలగించడానికి కాతేరు పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తీవ్రంగా రగిలిపోతున్న హిందూ భక్తులతో పాటు ఆ ప్రాంత వాసులు మంగళవారం ఆందోళనలకు దిగారు. బిజెపి నాయకుడు బూరా రామచంద్రరావు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. మహిళలు, స్థానిక పెద్దలు,యువకులు పెద్ద ఎత్తున గుడి వద్దకు చేరి.. బూరా రామచంద్రరావు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. కారు పార్కింగ్‌ కోసం.. దుర్గమ్మ తల్లి గుడి షెడ్డు కూల్చి వేసేందుకు కుట్ర పన్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసారు. గుడి జోలికి వస్తే..చూస్తూ ఊరుకోమని.. ప్రాణాలైన అర్పిస్తామని.. షెడ్డు కూల్చివేతను అడ్డుకుంటామని నినాదాలు చేసారు. సాయంత్రం దుర్గానగర్‌లో కాగడాల ప్రదర్శన చేసారు. ఈ నిరసనలు.. ఆందోళలనల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఒకవైపు దేశ వ్యాప్తంగా ఆలయాల పరిరక్షణకు బిజెపి నాయకులు ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే.. తమ ప్రాంతంలో మాత్రం దీనికి విరుద్దంగా రామచంద్రరావు అనే నాయకుడు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దేవుళ్లతో ఆటలు.. రాజకీయాలు ఆడితే.. సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. దుర్గానగర్‌లో మొదలైన ఈ ఉద్యమాన్ని ..తమకు న్యాయం జరగకపోతే ఎంతటి తీవ్రస్థాయికైనా తీసుకువెళ్తామని అంటున్నారు.ప్రభుత్వం దృష్టికి.. ఇంకా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌తో పాటు ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లి.. న్యాయం కోసం పోరాడతామన్నారు.
నిజాలను.. నిర్థారిస్తారా?
కేవలం తన కారు పార్కింగ్‌ కోసం.. అక్రమ నిర్మాణాలంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన బిజెపి నాయకుడు బూరా రామచంద్రరావు వ్యవహరాన్ని బిజెపి అగ్ర నాయకులు తేల్చాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అసలు తప్పెవరిదో తేలాలంటే.. నిజ నిర్థారణకు తమ ప్రాంతానికి రావాలని బిజెపి నాయకులను ఆహ్వనిస్తున్నారు.

భక్తుల మత విశ్వాసాలపై..దాడి
దుర్గానగర్‌లోని శ్రీ కనక దుర్గమ్మ ఆలయం.. స్థానికంగా ఎంతో ప్రాశస్త్యం కల్గి.. భక్తుల పూజలతో కళకళలాడుతూ ఉంటోంది. స్థానిక ప్రజలు.. ఈ ఆలయానికి వచ్చి భక్తితో అమ్మవారిని దర్శించుకుని.. పూజలు చేస్తారు. ప్రతీ ఏటా దసరా సమయంలో అయితే.. భవానీలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలతో దుర్గమ్మను పూజించి తరిస్తారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న షెడ్డులో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు అన్నదానాలు, ప్రసాద వితరణలు ఈ షెడ్డులోనే ఏర్పాటు చేస్తారు. ఇక స్థానిక ప్రజల జీవితాలతో.. ఈ దుర్గమ్మ తల్లి ఆలయానికి విడదీయరాని అనుబంధం ఉంది. అంతటి విశిష్టత.. ప్రజల సెంటిమెంట్‌తో కూడిన దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డును తొలగించాలని బిజెపి నాయకుడు బి. రామచంద్రరావు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం.. కేవలం తన వ్యక్తిగత కక్షతోనే అని అందరికి స్పష్టంగా అర్థమవుతోంది. హిందువులు మత విశ్వాసాలను పరిరక్షిస్తామని ప్రచారం చేసుకునే బిజెపి నాయకులు.. కాతేరులోని దుర్గానగర్‌లో బిజెపి నాయకుడు రామచంద్రరావు వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

 

Comment here