Andhra PradeshEast GodavariNews

ప్రజా క్షేమం పట్టని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

 ప్రజా క్షేమం పట్టని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
– 13వ డివిజన్ పర్యటనలో ఆదిరెడ్డి పిలుపు రాజమహేంద్రవరం సిటీ :
దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్న జగన్ సర్కార్కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. స్థానిక 13వ డివిజన్లో వారు మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగుకుమారి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు. డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో సమావేశమై ఇంటింటికి రేషన్ అందుతున్న తీరు, పెన్షన్ల ఏరివేత, అమ్మ ఒడి తదితర ప్రభుత్వ పథకాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కారణంగా ఇప్పటికే ఆర్ధికంగా, మానసికంగా, ఆరోగ్య పరంగా చితికిపోయిన ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక భారాలు వేసి పీడించడం సరైన విధానం కాదన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డివిజన్లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని, శిధిలమైన రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేపట్టాలని నగరపాలక సంస్థ సిబ్బందికి సూచించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరిట అడగకుండానే ప్రజలకు అప్పులు చేసి ఇచ్చి, వాటిని భర్తీ చేసుకునేందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, పరోక్షంగా విద్యుత్ బిల్లులు, చమురు ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన మనుగడ సాగించేందుకు ప్రజలపై అధిక భారాలు మోపడం సరైన పద్ధతి కాదని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, నిర్ణీత సమయానికే విద్యుత్ రీడింగ్ తీయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నీ గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది తాము చూసుకోమని ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్న ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక పెద్దలు జగపతి, కన్నయ్య, ప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు బొర్రా చిన్ని, హెరిటేజ్ శ్రీను, బాబ్జి, బాలు, వెంకటేష్, వాసు, శీలం శ్రీహరి, ఎం దుర్గారావు, బంగారు నాగేశ్వరరావు, సీహెచ్ గోపి, పి దానయ్య, పీతల సత్తిబాబు, ఆర్ రాజు, కె చంద్రశేఖర్, షేక్ భాషా, మద్దాల దుర్గా తదితరులు వారి వెంట ఉన్నారు.

Comment here