Andhra PradeshEast GodavariNews

బాదుడే..బాదుడు!

బాదుడే..బాదుడు!
`పెట్రోల్‌, డీజిల్‌పై ఆగని పన్నుల భారం
`సామాన్యులకు చుక్కలు..ప్రభుత్వాలకు లెక్కలు
`రూ.వెయ్యికి చేరువలో గ్యాస్‌ బండ
`సబ్సిడి పూర్తిగా ఎత్తివేసిన వైనం
`నిత్యావసరాల ధరలు పైపైకి
`రోడ్లపై పోలీసుల బాదుడుకు బెంబేలెత్తుతున్న జనాలు
`రైల్వే స్టేషన్‌లలోనూ..ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ రూ.30
ప్రజలను ఎన్నిరకాలుగా బాదాలో అన్ని రకాలుగానూ బాదేస్తున్నాయి.. మన ప్రభుత్వాలు. అటు కేంద్రంలోని మోడీ సర్కార్‌.. ఇటు రాష్ఠ్ర ప్రభుత్వాలు..తమ ఖజానాలను నింపుకోవడమే ధ్యేయంగా చెలరేగిపోతున్నాయి. పెట్రోల్‌,డీజిల్‌, గ్యాస్‌.. ఇలా చమురు ఉత్పత్తుల ధరలు పెరగడమే కానీ.. తగ్గడం తమకు తెలియదని రెచ్చిపోతుంటే.. నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వీటిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం.(జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ కరోనా దెబ్బకు.. జవసత్త్వాలు ఉడిగి.. నిరాశ, నిస్పృహాలతో బతుకు బండిని లాగుతున్న జనాలను.. దోచుకోవడమే పనిగా ప్రభుత్వాలు పన్నుల భారాన్ని మోపుతున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లి..కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ఈ దుర్భర పరిస్థితులలో.. జనాలపై భారాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. గత ఏడాది కరోనా విజృంభించిన నాటి నుంచి వరుసగా పెరుగుతూ వస్తోన్న పెట్రోల్‌,డీజిల్‌ ధరలు..ఇప్పటికే సెంచరీ మార్కును దాటేసాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ చమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోయిన సమయంలోనూ.. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఏమాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించకుండా..పెంచుకుంటూ పోయింది.దీని భారం.. ప్రజలు మోయాల్సి వస్తోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయాన్న సాకుతో.. మరోసారి వరుసగా పెట్రోల్‌,డీజిల్‌ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. ఈ కారణంగా లీటర్‌ పెట్రోల్‌ ధర 108కి చేరింది.డీజిల్‌ ధర దీనికి అతి చేరువలోకి వచ్చేసింది. ఈ రెండిరటి ధరలు పెరగడం వల్ల.. వీటి ప్రభావం..రవాణా రంగంపై పడుతోంది. దీనివల్ల నిత్యవసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారాన్ని మోయడం.. సామాన్య,మధ్య తరగతి కుటుంబాలకు కష్ట సాధ్కంగా మారుతోంది. ఇద్దరు పిల్లలున్న కుటుంబం.. నగరాలు, పట్ఠణాల్లో కనీసం తమ మౌలిక అవసరాలు తీర్చుకుని.. బతకాలంటే నెలకు రూ.20 వేలు కావలసి వస్తోంది. ఇక విద్య,వైద్యం..ఇతర అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి కారణం.. ఘనత వహించిన ప్రభుత్వాలు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గానీ.. రాష్ఠ్రంలోని ప్రాంతీయ పార్టీలు నడిపే ప్రభుత్వాలకు కానీ.. పన్నుల రూపేణా లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడమే లక్ష్యం తప్పా ప్రజా సంక్షేమం పట్టడం లేదు.

ఇదోరకం…దోపిడీ
పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కాదు..గ్యాస్‌ బండ ధర కూడా వెయ్యి రూపాయలకు చేరడానికి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు రూ. 200 నుంచి 300 లోపు గ్యాస్‌ సిలిండర్‌ ధర ఉండేది. అప్పట్లో యూపిఏ ప్రభుత్వం..చమురు సంస్థలకు సబ్సిడి మొత్తాలను చెల్లించేది. దీనివల్ల ప్రజలపై భారం పడేది కాదు. కానీ.. ఆ తర్వాత సబ్సిడి మొత్తం.. గ్యాస్‌ వినియోగదారుల ఖాతాల్లోనే పడుతుందంటూ..కొత్త విధానం పేరుతో మెలిక అమలు చేసారు. అసలు బ్యాంకు ఖాతాల్లో ఎంత సబ్సిడి పడుతుందో.. ఎప్పుడు పడుతోందో సామాన్యులకు తెలియకుండా పోయింది. సబ్సిడి పడితే..పడిరదనుకోవడం తప్పా పెద్దగా ప్రజలకు ఒరిగిందేమి లేదు. 2014లో మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత.. వరుసగా గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడి నెమ్మదిగా ఎత్తివేయడం ప్రారంభం అయింది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌కు రూ.950 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిరుపేద, సామాన్య,మధ్య తరగతి కుటుంబాలలో ఒక్కసారే వెయ్యి రూపాయలు గ్యాస్‌ బండకు ఖర్చుచేయడం భారంగా మారింది. ఈ విధంగా ప్రజలను పెట్రోల్‌,డీజిల్‌ ధరల పేరుతో రకరకాలుగా దోచుకుంటున్నారన్న విమర్శలు ప్రతిపక్షాలే కాదు.. ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కార్పోరేట్లకు..అప్పనంగా
దేశంలో రైల్వేలు,ఎల్‌ఐసి,ఇంకా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను.. నష్టాల బూచి చూపి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెగనమ్ముకుంటూ వస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక.. దేశంలోని ప్రజలు చెల్లించిన పన్నులను పెట్టుబడులుగా పెట్టి.. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఆనాటి ప్రభుత్వాలు దేశ సంపదగా సమకూర్చి పెట్టాయి. ఇవన్నీ ఒక రకంగా ప్రభుత్వ ఆస్తులే కాదు.. ప్రజల ఆస్తులు కూడా. ఈ ఆస్తులను.. కార్పోరేట్‌ యాజమాన్యాలకు కట్టబెట్దేందుకు మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం బరితెగించింది. ప్రజలు తమకు 300కు పైగా స్థానాలు కట్టబెట్టారన్న గర్వంతో.. తాము ఏమి చేసినా అడిగే వారు ఉండరన్న నిర్ణయానికి మోడీ ప్రభుత్వం వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో తమకు తిరుగే లేదనుకుని.. వరుసగా దేశ సంపదను గుజరాత్‌కు చెందిన కార్పోరేట్‌ దిగ్గజాలకు.. అంబానీలకు, ఆదానీలకు కట్టబెడుతూ..ముందుకు సాగుతున్నారు. ఎయిర్‌ పోర్టులు, రైల్వే స్టేషన్‌లు.. ఇలా అన్నింటిలోనూ ప్రైవేటీకరణ మంత్రాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధంగా లక్షల కోట్ల విలువైన దేశ సంపదను.. కార్పోరేట్ల చేతుల్లో పెట్టడం,..దీన్ని ప్రతిపక్షాలు సైతం గట్టిగా ఎదిరించి.. నిలదీయలేకపోవడం సిగ్గుచేటు. ఇవన్నీ ప్రైవేటీకరణ అయితే..ప్రస్తుతం ఉన్న ధరల స్థానంలో బాదుడు ఖాయం.
లక్షల కోట్లు..లక్ష్యం
ఒకవైపు కార్పోరేట్‌ శక్తులకు అప్పనంగా ప్రభుత్వ రంగ ఆస్తులను కట్టబెడుతున్న పాలకులు..మరోవైసు పెట్రోల్‌, డీజిల్‌ వంటి ధరలను పెంచడం ద్వారా 4 నుంచి 5లక్షల కోట్ల రూపాయల వరకు పిండుకుంటున్నారు. అలాగే రాష్ఠ్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో పన్నులను వేస్తున్నాయి. ఈ ప్రభుత్వాల లక్ష్యం.. ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలను వివిధ రకాల మార్గాల ద్వారా లాగేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రజలు.. ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోతున్నారు.

Comment here