Andhra PradeshEast GodavariNews

మోసపూరిత హామీలతో రైతులను దగా చేయడం తగునా…

మోసపూరిత హామీలతో రైతులను దగా చేయడం తగునా… టిడిపి పార్లమెంటరీ అధికార ప్రతినిధి పుత్సల

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:వైసిపి ప్రభుత్వం మోసపూరిత హామీలతో రైతులను దగా చేయడం తగునా…?అంటూ అమలాపురం పార్లమెంటరీ టిడిపి అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ ప్రశ్నించారు. బుధవారం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పుత్సల మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి చేసే సాయం పై చెప్పే లెక్కలకు,వాస్తవాలకు పొంతన లేదన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేటప్పుడు మోటార్లకు మీటర్లు ఎందుకన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు,రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి కేవలం 47 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా కుదించడం,ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం సొమ్ము 24 గంటల్లో రైతులకు అందాల్సి ఉండగా,నెలల తరబడి ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. టిడిపి హయాంలో చంద్రబాబు 90% సబ్సిడీతో మెట్ట ప్రాంత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే,ఈ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో ఒక్క శాతం కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వకపోవడం రైతులను దగా చేయడం కాదా  అన్నారు.రాష్ట్రములో అన్ని వాణిజ్య వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర అందించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియ జేస్తుందన్నారు.రాష్ట్రములోని రైతుల సహకార సంఘ పాల డైరీలను నిర్వీర్యం చేసే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించే ప్రణాళిక రూపొందించడం న్యాయమా అన్నారు.కృష్ణా,గోదావరి జిల్లాలలో బచావత్ కమిషన్ ఏపీకి కల్పించిన హక్కుల్ని కేంద్రానికి దారాదత్తం చేయడం దగా కాదా అని పేర్కొన్నారు.పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్ని అరికట్టలేక పోవడం ప్రభుత్వ అసమర్థత కు నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాల చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రైతులకు జరుగుతున్న అన్యాయాలు 18 ప్రశ్నలతో కూడిన వినతి పత్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ టిడిపి మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ కరీం సాహెబ్,టిడిపి నాయకులు మత్స గంగరాజు,గుడిమెట్ల నాగ బసవలింగం,సిద్దిరెడ్డి శ్రీనివాస్,బొల్లోజు రాంప్రసాద్,పైడి ఆనందరావు, తమ్మినేని గోపాలం,తోరం వడ్డీ కాసులు,బండారు ఏడుకొండలు పాల్గొన్నారు.

Comment here