Andhra PradeshEast GodavariNews

వసతి గృహాల్లో.. సంక్షామం

వసతి గృహాల్లో.. సంక్షామం
`ధవళేశ్వరం ఎస్సీ బాలుర వసతి గృహంలో అస్తవ్యస్త పరిస్థితులు
`సక్రమంగా అమలుకాని మెనూ
`రోజూ అరటి కాయ కూరే..అందని పాలు,మజ్జిగ
`గదుల్లో పనిచేయని లైట్లు, ఫ్యాన్‌లు
`పిల్లల వద్ద డబ్బులు లాగేసుకుంటున్నారన్న ఆరోపణలు
`తాగేసి వచ్చి..పిల్లలపై జులుం ప్రదర్శిస్తున్న వార్డెన్‌
`ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు
`కలెక్టర్‌ గారూ..కనికరిస్తారా?
`పిల్లల కడుపు కొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటారా?
ప్రభుత్వాలు.. బాల బాలికల సంక్షేమానికి ప్రతీఏటా వేలా కోట్లు ఖర్చు చేస్తుంటే.. కొందరు ప్రభుత్వోద్యోగలు..ఈ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. పిల్లల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖలో అవినీతి..సంక్షేమ వసతి గృహాల్లో బాలల పాలిట శాపంగా మారుతోంది. హాస్టల్లల్లో సక్రమంగా అమలు కాని మెనూ..పిల్లల కడుపు కొడుతూ ఉంటే.. పనిచేయని లైట్లు..ఫ్యాన్లు..సమస్యల తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని.. ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ బాలుర వసతి గృహంలో పిల్లల కష్టాలపై దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి,రాజమహేంద్రవరంÑపేదరికం.. కడుపున పుట్టిన పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పోతోంది.కట్టుకోవడానికి గుడ్డ..చదువు కోవడానికి పుస్తకం..అందించలేక పోతోంది. అలాగని..పిల్లలను గాలికి వదిలేయ లేక.. బాల కార్మికులుగా మార్చలేక.. ఎందరో తల్లిదండ్రులు.. తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తున్నారు. తమ పిల్లలు అక్కడైనా కడుపునిండా తిని..కంటి నిండా నిద్రిస్తూ..చక్కగా చదువు కుంటారని కలలు కంటున్నారు. కానీ.. ఇలాంటి పేద తల్లిదండ్రుల ఆశలను.. కొందరు వార్డెన్‌లు.. వమ్ము చేస్తున్నారు. తమ అడ్డగోలు విధానాలతో.. పిల్లల కడుపు కొట్టి.. అక్రమార్జనకు బరితెగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం.. అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రాజమహేంద్రవరం రూరల్‌లోని ధవళేశ్వరంలో.. ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ బాలుర వసతి గృహం ఉంది. ఈ గృహంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆశ్రయం పొందుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద తల్లిదండ్రులు తమ పిల్లలను.. ప్రభుత్వ సహకారంతో మంచి చదువులు చదివించుకోవాలని ఇక్కడ చేర్పిస్తున్నారు.కానీ..ఇక్కడ మాత్రం వీరి పిల్లలు.. అసౌకర్యాల నడుమ చదువులను కొనసాగిస్తున్నారు. ఈ వసతి గృహంలో.. ప్రభుత్వం నిర్థేశించిన ప్రకారం మెనూ అమలు కావడం లేదని.. వసతి గృహంలోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వార్డెన్‌గా పనిచేస్తున్న సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన గారు.. పిల్లల పొట్ట కొట్టి… నాలుగు రాళ్లు వెనకేసుకునే పనిలో చాలా బిజి బిజీగా ఉంటున్నారని అంటున్నారు.
అమలు కానీ జగనన్న మెనూ..
ధవళేశ్వరం ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో.. వందల మంది పిల్లలు వసతి పొందుతూ.. విద్య నభ్యసించేవారు, అయితే.. గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ విరుచుకు పడటంతో.. ప్రస్తుతం 40 నుంచి 50 మంది మాత్రమే పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చాక.. వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ఇక్కడ చదువుకునే పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో.. మెనూలో మార్పులు కూడా చేసారు. పాలు,గ్రుడ్లు, మజ్జిగ, చిక్కీలు..వారానికి రెండు లేదా మూడు సార్లు చికెన్‌, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు.. ఇలా అన్నిరకాలతో సమతుల ఆహారం పిల్లలకు అందించాలని ఆదేశించారు. ఆ మేరకు నిధులను మంజూరు చేస్తున్నారు. కానీ.. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమం .. ధవళేశ్వరం ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో అమలు కావడం లేదు. ఇక్కడ వార్డెన్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ..మెనూను తుంగలోకి తొక్కి.. ఇష్టారీతిగా వంటకాలను తయారు చేయించి పిల్లలకు పెడుతున్నారు. రోజూ అరటి కాయ కూర.. పెడుతున్నారని పిల్లలు చెబుతున్నారు. అంతేకాదు.. వీరికి పాలు, మజ్జిగ అనేవి ఇవ్వడమే మర్చిపోయారంట.. వార్డెన్‌ సత్యనారాయణ. ఉదయం వండిన కూరలు.. బయట నుంచి ఎవరైనా ఇచ్చిన ఆహార పదార్థాలను.. అవి ఎలా గున్నా పిల్లలకు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వసతి గృహంలో పిల్లలు ఉంటున్న గదుల్లో.. లైట్లు వెలగడం లేదు. ఫ్యాన్లు పూర్తిగా తిరగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తాము చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు.
మద్యం మత్తులో..వార్డెన్‌
ధవళేశ్వరం ఎస్సీ వసతి గృహం వార్డెన్‌గా పనిచేస్తున్న సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈయన నిత్యం మద్యం సేవించే విధులకు హాజరవతారని పిల్లలే చెబుతున్నారు. ఇక పిల్లలకు వారి తల్లిదండ్రులు గానీ.. ప్రభుత్వం గాని ఇచ్చే డబ్బులను.. వార్డెన్‌ సత్యనారాయణతో పాటు ఇక్కడ పనిచేసే సిబ్బందిలో కొందరు గుడ్లు పెడతాం.. అవి కొంటాం..ఇవి కొంటామంటూ లాగేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం మత్తులోనే.. విధులు నిర్వర్తిస్తూ.. పిల్లల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారన్న వాదన ఉంది.వార్డెన్‌ నిర్వాకంపై పలువురు సాంఘిక సంక్షేమ శాఖ ఏఎస్‌డబ్ల్యూ, కాకినాడలోని జెడీకి ఫిర్యాదులు చేసినా.. వారు సక్రమంగా స్పందించలేదని సమాచారం. సదరు వార్డెన్‌తో పాటు కొందరు సిబ్బందిపైనా చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు రాజమండ్రి ఏఎస్‌డబ్య్యూ అంటున్నారు.
కలెక్టర్‌ గారూ.. చక్కదిద్దుతారా?
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌..ధవళేశ్వరం ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో అస్తవ్యస్త పరిస్థితులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. పిల్లల పొట్ట కొట్టి.. ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వార్డెన్‌ సత్యనారాయణతో పాటు సిబ్బందిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మెనూను సక్రమంగా అమలు చేసేలా చూడాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Comment here