Andhra PradeshEast GodavariNews

విద్యార్థుల ఆశయాలను ఆవిరిచేస్తున్న విద్యా దీవెన

విద్యార్థుల ఆశయాలను ఆవిరిచేస్తున్న విద్యా దీవెన

కోస్తాఎన్ కౌంటర్,రామచంద్రపురం : విద్యార్ధులకు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజుల్ని ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో కాకుండా తల్లుల ఖాతాల్లో వేస్తుండటంతో వారు తిరిగి కాలేజీలకు ఆ సొమ్మును చెల్లించడం లేదు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని బ్రేకులు వేసింది. అదే సమయంలో ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు  చెల్లించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో  విద్యార్థులకు సర్టిఫికెట్లు లేక  పై చదువులకు వెళ్లాలనే  వారి ఆశయం కాస్తా ఆవిరవుతోంది. మరోవైపు  ప్రభుత్వం   పై కోర్టుకు అప్పీలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఏపీ విద్యార్ధులకు వారి కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల్ని రీయింబర్స్ మెంట్ పేరుతో తిరిగి చెల్లించే పధకం గతంలో మాజీ సీఎం వైఎస్సార్ హయాంలోనే ప్రారంభమైంది. అప్పట్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించక తప్పని పరిస్ధితి ఎదురైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వివిధ రూపాల్లో పేర్లు మార్చుకుంటూ కొనసాగుతున్న ఈ పథకానికి వైసీపీ సర్కార్ జగనన్న విద్యా దీవెనగా నామకరణం చేసి అమలు చేస్తోంది. జగన్ ప్రభుత్వం ఏటా కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల్ని కాస్తా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా వేస్తోంది. దీంతో విద్యార్ధులకు ఆ మేరకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా కాలేజీలకు బదులుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాల్ని జమ చేస్తుండటంతో ఆ సొమ్ము  కాస్తా కాలేజీలకు చేరడం లేదు. దీంతో కాలేజీలు కోర్టుకెక్కాయి. కేసు విచారించిన హైకోర్టు.. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయడమేంటని వైసీపీ సర్కార్ ను ప్రశ్నించింది. ఇలా తల్లుల ఖాతాల్లో వేసిన 40 శాతం ఫీజులు కాలేజీలకు చేరని విషయాన్ని గుర్తు చేసింది. దీంతో విద్యాదీవెన పథకం ఉద్దేశం నెరవేరడం లేదని కోర్టు  తెలిపింది.  ప్రయోజనం నెరవేరనప్పుడు తల్లుల ఖాతాల్లో ఫీజులు వేయకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో ఇకపై నేరుగా కాలేజీల ఖాతాల్లోనే ఫీజులు వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది. దీనిపై అప్పీలుకు వెళ్తామని చెప్తున్నా ఇంత వరకూ ఆ దిశగా అడుగులు పడుతున్న దాఖలాలు కనిపించకపోవడం విశేషం. దాంతో విద్యార్థులు అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. దీనితో కాలేజి  విద్యార్థులు దిక్కు తోచని పరిస్థితిలో పడి ఉన్నారు.

Comment here