Andhra PradeshEast GodavariNews

వివిధ అలంకరణల్లో అమ్మవార్లు దర్శనం

వివిధ అలంకరణల్లో అమ్మవార్లు దర్శనం
తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులోని వాసవి మాతను ధనలక్ష్మిదేవిగా అలంకరించిన దృశ్యం….
ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన దృశ్యం….
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానంగా దసరా ఉత్సవాలు ఏడవ రోజు బుధవారం దుర్గాదేవిగా ఉత్సవ కమిటీల వారు అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు జరిపారు. పట్టణంలోని చిన్న వంతెన సమీపంలోని శంకరమఠంలో వేంచేసియున్న సర్వమంగళాదేవిని, రామచంద్రరావుపేట శ్రీకృష్ణయోగా ధ్యాన మందిరంలోని చింతామణెమ్మవారిని, వీకర్స్‌ కాలనీలోని గాయత్రీ అమ్మవారిని, మండలంలోని ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. అలాగే, పట్టణంలోని 17వ వార్డులోని శ్రీవిశ్వదుర్గేశ్వరి అమ్మవారిని హరిత దేవిగా అలంకరించారు. రకరకాల పక్షులు, కుందేళ్ళు, బాతులు, కోతులు, కోనేటి సరస్సు వంటి ప్రకృతి అందాల మధ్య విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ఉంచి పూజలు అందించారు. 108 కలశాలు, బిందెలతో గోదావరి నీటిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకించారు. ఈ సందర్భంగా పెన్నాడ సత్యనారాయణ ` శుభవాణి, పాండురంగ కళ్యాణ్‌ కృష్ణ ` రాజేశ్వరి దీప్తి దంపతులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు రోడ్డులోని వాసవి మాతను ప్రత్యేకాలంకరణ ధనలక్ష్మిగాను, ఉత్సవమూర్తి విజయలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, మండలంలోని వీరంపాలెం శైవక్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలాత్రిపుర సుందరీ అమ్మవారిని కాళరాత్రిగా అలంకరించారు. ముత్యాలంబపురం ముత్యాలమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మాకా బాలాజీ, ఆలయ మేనేజర్‌ నామా సూర్యప్రకాశరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, 17వ వార్డులో విశ్వదుర్గేశ్వరి ఆలయం వద్ద మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గొర్రెల శ్రీధర్‌లు, ఇతర ఉత్సవ కమిటీలు భక్తులకు సౌకర్యాలు కల్పించాయి.

Comment here