Andhra PradeshEast GodavariNews

వైసిపిలో..అసమ్మతి జ్వాలలు

వైసిపిలో..అసమ్మతి జ్వాలలు
`ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జి వైవి. సుబ్బారెడ్డి వైఖరిపై అసహనం
`ఆయన వల్లే రాజమండ్రిలో పార్టీ దెబ్బతింటుందని వాకచర్ల కృష్ణ వ్యాఖ్యలు
`పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ..నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌ ఉత్తర్వులు
`ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల ఆధిపత్య పోరుతో.. ఇప్పటికే చీలిక
`పార్టీ అధినాయకత్వం నిర్లక్ష్య వైఖరితో ..మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు మనస్థాపం
`ఎంపి భరత్‌,రాజ్యసభ సభ్యుడు పిల్లి బోస్‌ల చర్చలు?
`ఇలాగైతే.. కార్పోరేషన్‌ ఎన్నికల్లో కష్టమే!
రాజమహేంద్రవరం వైసిపిలో.. అసంతృప్తి సెగలు పొగలు కక్కుతున్నాయి. పార్టీలో ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు.. స్థానిక నాయకులను పట్టించుకోక పోవడం.. కార్యకర్తలతో మమేకం కాకపోవడం.. సీనియర్‌ నేత రౌతు సూర్యప్రకాశరావు వంటి వారి విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం..అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలను ఎగసిపడేలా చేస్తున్నాయి.కారణాలు ఏవైనా..వైసిపి నేత వైవి.సుబ్బారెడ్డిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం.(జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలకమైన రాజమహేంద్రవరం రాజకీయాలు..ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ఇక్కడ అధికార పార్టీ వైసిపిలో..ముసలం బయలుదేరింది. ఇప్పటికే..ఎంపి మార్గాని భరత్‌ రామ్‌..ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ రెండుగా చీలింది. వర్గాలుగా విడిపోయింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు వర్గం అసంతృప్తి సెగలు..వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట.. ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జి, టిటిడి చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి రాజమండ్రికి విచ్చేసారు. స్థానిక సెంట్రల్‌ జైల్‌ ఎదురుగా ఉన్న మంజీర కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాలతో సమావేశమయ్యారు. సిఎం జగన్‌ ఆదేశాలతో..ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి వైవి.సుబ్బారెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించారని ప్రచారం సాగింది.ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావుతో ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో నడిచిన సీనియర్‌ నాయకులు, రౌతు అభిమానులు, అనుచరులు.. స్థానిక రౌతు తాతాలు కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్న నాయకుడు.. సీనియర్‌ నేత అయిన రౌతు సూర్య ప్రకాశరావు విషయంలో .. పార్టీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరును.. నిరసించారు. తమ నాయకుడి విషయంలో ఇంతటి నిర్లక్ష్యాన్ని భరించలేకపోతున్నామని పేర్కొన్నారు. అంతేకాదు.. రౌతుకి న్యాయం చేయకపోతే పార్టీని సైతం వీడడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలు పంపించారు. ఇదిలా ఉండగా.. రౌతుకి అత్యంత సన్నిహితుడు, అనుచరుడు వాకచర్ల కృష్ణ.. ఏకంగా సిఎం జగన్‌, ఇన్‌చార్జి వైవి. సుబ్బారెడ్డిలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేసినట్లు ఒక పత్రికలో వార్త వచ్చింది. మహానేత, దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఎప్పుడు రాజమండ్రి వచ్చినా.. పార్టీ నాయకులు, కార్యకర్తలందరితోనే మాట్లాడేవారని.. వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారని వాకచర్ల కృష్ణ అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సిఎం జగన్‌ గానీ.. వైవి. సుబ్బారెడ్డి గానీ.. రాజమండ్రిలో ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజా మధ్య గొడవలు జరుగుతుంటే.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను అడగలేదని విమర్శించారు. వైఎస్‌ హాయంలో ఏనాడు పార్టీలో గ్రూపులు లేవంటునే.. నగరంలో ఇటీవల పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎంపి భరత్‌ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమలో కనీసం 20 మంది ఉండటం లేదని..గతంలో గడప గడపకు కార్యక్రమంలో 200 మంది కార్యకర్తలు పాల్గొనేవారన్నారు.రాజమండ్రిలో వైసిపి ఈ విధంగా దిగజారిపోవడానికి కారణం.. పార్టీ సమన్వయ కర్త వైవి.సుబ్బారెడ్డేనని కుండ బద్దలు కొట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి జండా మోసిన వారికి.. సీనియర్‌ నాయకులకు విలువ లేకుండా పోయిందని.. ప్లెక్సీలు కట్టి.. హడావిడి చేస్తున్న నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుందని. ఇంతవరకు రాజమండ్రికి ముగ్గురు కో`ఆర్డినేటర్లను మార్చారే తప్ప.. నిలకడగా ఉండేలా ఒక కో`ఆర్డినేటర్‌ను నియమించలేక పోయారని ఎద్దేవా చేసారు.కేవలం సుబ్బారెడ్డి అసమర్థత వల్లే.. పార్టీ ఈ స్థాయికి దిగజారిందంటూ వాకచర్ల కృష్ణ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు.. వైసిపిలో తీవ్ర దుమారాన్నే రేపాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన వైసిపి అధినాయకత్వం మాజీ కార్పోరేటర్‌ వాకచర్ల కృష్ణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ… నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌తో ఉత్తర్వులు జారీ చేయించారు.అయితే.. ఒక పత్రికలో వచ్చిన ఈ కథనంలో అవాస్తవాలు ఉన్నాయని వాకచర్ల కృష్ణ ఖండన ఇచ్చినట్లు సమాచారం. తాను అనని మాటలను కూడా ఆ పత్రికలో ప్రచురించారని వాకచర్ల వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొదలైందా..ముసలం
రాజమండ్రిలో ఇప్పటికే మూడు సార్లు నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లూ.. తెలుగుదేశం పార్టీనే విజయం సాధించింది. ఆ పార్టీకీ.. నగరంలోని 50 డివిజన్లలోనూ పటిష్టమైన కార్యకర్తల బలం ఉంది. ఈ బలం కారణంగానే..2019 ఎన్నికల్లో రాజమండ్రిలో టిడిపి తరపున పోటీచేసిన ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజకీయ చాతుర్యం.. భర్త ఆదిరెడ్డి వాసు కష్టం.. భవానీని ఎమ్మెల్యేని చేసాయి. త్వరలో రాజమండ్రి కార్పోరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అధికార వైసిపి పరిస్థితి చూస్తే.. గందరగోళంగా కనిపిస్తోంది. సరైన సమన్వయ కర్త లేకపోవడం.. ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల మధ్య ఆధిపత్య పోరులో నలిగిపోతున్న క్యాడర్‌.. డివిజన్‌ స్థాయిలో పార్టీ పటిష్టంగా లేకపోవడం.. తాజా వివాదాలు.. వైసిపి విజయావకాశాలపై ప్రభావం చూపుతాయన్న వాదన వినిపిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు పార్టీ అధినాయకత్వం తీరుతో విసిగిపోవడం..మనస్థాపం చెందడం తెలిసిందే. ఇటీవల టిటిడి సభ్యురాలిగా రౌతు సతీమణికి అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగింది. దాదాపు ఖాయం అన్న సమయంలో.. రౌతు సతీమణికి మొండి చేయి చూపడం కూడా రౌతు మనస్థాపానికి కారణంగా చెబుతున్నారు. ఎంపి భరత్‌, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌.. రౌతు ఇంటికి వెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే..వీరి మధ్య చర్చలు ఏం జరిగాయన్నది బయటకు రాలేదు. ఇప్పటికైనా రౌతు అలక పాన్పు వీడతారా? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? అన్నది చూడాలి. ఏది ఏమైనా.. రాజమండ్రి వైసిపిలో ఈ పరిణామాలు.. భవిష్యత్తులో ఏవిధమైన ఫలితాలను ఇస్తాయో చూడాలి.

 

Comment here