Andhra PradeshEast GodavariNews

సంక్షేమం సాకుతో రాష్ట్రంలో సంక్షోభం 

సంక్షేమం సాకుతో రాష్ట్రంలో సంక్షోభం
– ఇచ్చిన హామీతో ధరలు అలా పెంచుకుంటూ పోతున్నారు
– ప్రజలపై అధిక భారాలు తగవు
– పెంచిన విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి
– మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ధ్వజం
రాజమహేంద్రవరం సిటీ:
సంక్షేమం సాకుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) విమర్శించారు. ఎన్నడూ ఏ ప్రభుత్వ పాలనలో లేని విధంగా అన్ని రకాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు అన్ని పెంచుకుంటూ పోతానని చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తూ పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, విద్యుత్ చార్జీలను పెంచుకంటూ పోతున్నారని ఎద్దేవా చేసారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు వారి జీవితాల్ని సర్వనాశనం చేసేలా పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న ఈ సమయంలో పన్నులు, చార్జీలను పెంచుతూ ప్రజలపై భారాలను మోపుతున్నారని మండిపడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా సలహాదారుల నియమాకం, ప్రచార ఖర్చు, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేస్తూ దుబారా చేస్తున్న ప్రజాధనంతో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర బడ్జెట్ను ప్రజలకు పంచిపెడుతూ నవరత్నాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టించే ఆలోచన చేయకుండా సమర్థత, అవగాహన లేని పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసారన్నారు. కరెంటు బిల్లులు పెంచితే పరిశ్రమలు, పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలకు సంక్షేమ పథకాలను లింక్ పెట్టి రేషన్ కార్డులు, పింఛన్లను నిలుపుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారి పింఛన్లను అర్థాంతరంగా నిలుపుదల చేస్తున్నారని జగన్ వారి ఉసురుపోసుకోవడం ఖాయమన్నారు. ఆధ్వాన్నంగా ఉన్న రోడ్లను మరమ్మతు చేయకుండా ప్రభుత్వం బాధ్యతలను విస్మరిస్తే ప్రతిపక్ష నాయకులు రోడ్లు మరమ్మతులు చేస్తూంటే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ 36 వేల 102 కోట్ల అదనపు భారం వేసారని, ఇటువంటి కరెంటు చార్జీలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో కుంటిసాకులు చెబుతూ చాలా మందికి సంక్షేమ పథకాల్ని కట్ చేసారని మండిపడ్డారు. కరెంటు చార్జీల పెంపుదలను వెనక్కి తీసుకోకపోయినా.. అర్హులకు సంక్షేమ పథకాలు అందుకున్నా ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. రోడ్లు, డ్రైనేజీలు ఆధ్వాన్నస్థితిలో ఉ న్నాయని వాటి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. బిల్లులు ఇవ్వకుంటే పనిచేయడానికి ఏ కాంట్రాక్టర్ మాత్రం ఎందుకు ముందుకు వస్తారని ప్రశ్నించారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి టీడీపీ కమిటీల ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలు సేకరించి విద్యుత్ చార్జీల భారంపై తీర్మానాలు చేస్తామని, 25వ తేదీ వరకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, 25 నుంచి 31వ తేదీ వరకు వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వంపై వత్తిడి పెంచేలా కార్యాచరణ చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు టీడీపీ ఈ ఉద్యమ కార్యాచరణ చేపట్టిందని ఇటువంటి కష్టకాలంలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే అండగా నిలబడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని, ఇప్పటికే చాలా మంది ప్రజలకు జగన్ పరిపాలనా తీరు అర్థమైందని, త్వరలోనే వైకాపా జెండాను పీకేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని స్పష్టం చేసారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, కార్యదర్శి కడితి జోగారావు, నాయకులు నక్కా దేవివరప్రసాద్, బొర్రా చిన్ని, ఈతలపాటి రవి, చాపల చిన్ని రాజు, దుత్తరపు గంగాధర్, జయరామ్, బషీర్ పాల్గొన్నారు.

Comment here