Andhra PradeshEast GodavariNews

హిందువుల మనోభావాలపై.. బిజెపి నాయకుడి దాడి

హిందువుల మనోభావాలపై.. బిజెపి నాయకుడి దాడి
`రాజమండ్రిలో దుర్గమ్మ తల్లి ఆలయంపై బిజెపి నాయకుడు రామచంద్రరావు కుట్ర
`కాతేరు దుర్గానగర్‌లో ఆలయం షెడ్డు తొలగించాలని లోకాయుక్తలో ఫిర్యాదు
`కారు పార్కింగ్‌ కోసం..ఆలయం స్ధలానికే ఎసరు పెడుతున్న దుర్మార్గం
`ఆలయం షెడ్డుతో పాటు వీధిలోని ఇతర ఇళ్ల మెట్లను తొలగించాలని డిమాండ్‌
`క్షేత్ర స్థాయిలో ప్రజలను విచారించకుండానే సర్వేయర్‌ రిపోర్టు
`దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డు తొలగించడానికి పంచాయతీ అధికారుల నోటీసులు
`ఇళ్ల నుంచి బయటకు రావడానికి కట్టుకున్న మెట్లను తొలగించాలంటూ అధికారుల ఒత్తిళ్లు
`తీవ్రంగా మండిపడుతున్న దుర్గానగర్‌ వాసులు.. హిందూ భక్తులు
చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి దొమ్మరి గుడిసెలు అని తెలుగులో ఓ నానుడి. ఈ మాట బిజెపి నాయకులకు సరిగ్గా సరిపోతుందంటున్నారు.. రాజమండ్రిలోని కాతేరు పంచాయతీ పరిధిలోని దుర్గానగర్‌ వాసులు. ఎవరికి అడ్డులేని..తమ ప్రాంత వాసుల మనోభావాలతో ముడిపడిన దుర్గమ్మ తల్లి ఆలయం కూల్చివేతకు కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం.(జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ జై శ్రీరామ్‌..అంటే హిందూవుల ఆలయాలను లక్ష్యంగా చేసుకుని..కుట్రలకు పాల్పడటమా? తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం.. రాజ్యాంగ బద్ద, ప్రజాస్వామ్య వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తూ..వికృతానందం పొందడమా?.. ఈ ప్రశ్నలకు బిజెపి నాయకులే సమాధానాలు చెప్పాలి. దేశంలో హిందూమతానికి.. తామే బ్రాండ్‌ అంబాసిడర్లమంటూ.. జబ్బలు చరుచుకునే బిజెపి నాయకులు.. రాజమండ్రి రూరల్‌ కాతేరు గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్‌లోని శ్రీ కనక దుర్గమ్మ ఆలయంపై ఓ బిజెపి నాయకుడు సాగిస్తున్న దాష్టీకంపై ఏం సమాధానం చెబుతారని ఆ ప్రాంత వాసులు నిలదీస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కాతేరు గ్రామ పంచాయతీ పరిధిలో దుర్గానగర్‌ అనే ప్రాంతం ఉంది. అసలీ ప్రాంతానికి దుర్గా నగర్‌ అని పేరు రావడానికి కారణం.. ఇక్కడ వెలసిన దుర్గమ్మ తల్లి ఆలయం. 1970 వ దశకంలో ఈ ప్రాంతంలో ఉండే బత్తుల శ్రీదేవి కుటుంబంలోని పూర్వీకులు ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ఈ ప్రాంతానికి దుర్గానగర్‌ అని పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతం రకరకాలుగా మార్పులు చెందింది. ఈ గుడికి మరోవైపు అప్పట్లో లే`ఆవుట్‌ వేసి.. ఇళ్లస్థలాలుగా మార్చారు. ఆ ప్రాంతంలో రామసాయి టౌన్‌ షిప్‌ పేరుతో మల్లయ్య పేటలో ఇళ్లను నిర్మించారు. ఇక దుర్గా నగర్‌లో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం.. వీధి చివరన ఉంటుంది. ఈ ఆలయంతోనే ఆ వీధి ముగుస్తుంది. ఆ తర్వాత సుమారు ఆరు అడుగుల ఎత్తులో అవతలి ప్రాంతం వారి రోడ్డు ఉంటుంది. ఇలా ఎవరికి అడ్డు లేని ఈ దుర్గమ్మ తల్లి ఆలయం.. స్థానికంగా ఉండే బిజెపి నాయకుడు బి. రామచంద్రరావుకు అడ్డు వచ్చిందంటా. ఈ ఆలయానికి ముందు భక్తుల సౌకర్యార్థం వేసిన రేకుల షెడ్డును తొలగించాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేసారు. దీంతో పాటు ప్రజల రాకపోకలకు అడ్డుగా ఉన్నాయంటూ.. ఆ ప్రాంతంలోని ఓ ఆపార్టుమెంట్‌ మెట్లు తొలగించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డుతో పాటు.. ఆ వీధిలోని స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా నిర్మించుకున్న చిన్న చిన్న మెట్లను తొలగించాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు 2016లోనే బిజెపి నాయకుడు బి. రామచంద్రరావు దాఖలు చేసినట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
అసలు విషయం ఇదీ..!
ఇంతకీ అసలు విషయం వేరేలా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో దుర్గమ్మ తల్లి ఆలయం నిర్వాహకులు బత్తుల శ్రీదేవి ఇంటి పక్కనే ఈ బిజెపి నాయకుడు బూరా రామచంద్రరావు నివసిస్తున్నారు. ఒక నర్సుతో.. జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన గారికి ఒక కారు ఉంది. ఈ కారును తన ఇంటి ముందు పార్కింగ్‌ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అలా కాకుండా.. తనను ఎదిరించేవారు ఎవరున్నారన్న ఆహంకారమో..లేదా తాను బిజెపి నాయకుడినని.. తాను ఏమైనా చేయగలను అనే అతి విశ్వాసమో తెలియదు కానీ..తన కారు పార్కింగ్‌ కోసం అద్భుతమైన పథకాన్ని రచించారు.
తన ఇంటికి ఎదురుగా ఉన్న అపార్టుమెంటును ఆనుకుని డ్రైనేజీ పక్కనే ఉన్న స్థలంలో తన కారు పార్కింగ్‌ చేయడానికి ప్రయత్నించడం.. దీనికి ఆ అపార్టుమెంటు వాసులు అభ్యంతరం తెలపడం.. దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డు ప్రాంతంలో కారు పార్కింగ్‌కు తెగించడం.. దీనికి భక్తులు అడ్డు చెప్పడంతో.. రామచంద్రరావు అహం దెబ్బతింది. దీంతో ఎలాగైనా వీరందరిపై కక్ష సాధించాలన్న భావనతో.. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని.. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందంటూ.. లోకాయుక్తలో ఒక తప్పుడు ఫిర్యాదును దాఖలు చేసారు. ఈ ఫిర్యాదుపై ఏం విచారణ జరిపారో తెలియదు కానీ.. పంచాయతీ అధికారులు లోకాయుక్తకు తాము సర్వే చేసిన రిపోర్టును పంపించారు. 2016 నుంచి ఇప్పటివరకు కాతేరు పంచాయతీ అధికారులు ఎన్నిసార్లు లోకాయుక్తకు.. ఈ ఫిర్యాదుపై వివరణలు పంపించారో వారే చెప్పాలి. ఇక ఇటీవల కొన్ని రోజులుగా..కాతేరు పంచాయతీ ఈఓ హనుమంతరావు తన సిబ్బందితో దుర్గానగర్‌ ప్రాంతంలోని దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డుతో పాటు ఎదుట ఉన్న అపార్టుమెంట్‌ మెట్లను కొట్టేయాలని నోటీసులు పంపించి.. చర్యలకు దిగారు. ప్రస్తుతం కాతేరు పంచాయతీ అధికారుల ఒత్తిళ్లతో స్థానికంగా ఉండే అమ్మవారి భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏది అక్రమం?
సాధారణంగా నగరాలు, పట్టణాలు,గ్రామాల్లో ఇళ్లను నిర్మించుకున్న తర్వాత.. ఇంటి నుంచి బయటకు రావడానికి మెట్లను కట్టుకుంటారు. ఈ మెట్లను తమ ఇళ్లను ఆనుకుని నిర్మించిన డ్రైనేజీలపై నిర్మించుకుంటూ ఉంటారు. ఇది పెద్ద నేరం కాదు. తమ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో.. చిన్న పాటి మెట్లను కట్టుకోవడం.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడమూ కాదు. కానీ.. కాతేరు పంచాయతీలోని కేవలం దుర్గా నగర్‌ ప్రాంతంలోనే ఆక్రమణలు ఉన్నాయంటూ.. బిజెపి నాయకుడు ఏకంగా లోకాయుక్తలోనే ఫిర్యాదు చేయడం.. ప్రజలకు ఉపయోగపడాల్సిన లోకాయుక్త వంటి న్యాయ సేవాధికార సంస్థను తప్పుదోవ పట్టించడమే. ప్రజలకు న్యాయపరమైన సేవలను అందించాల్సిన సంస్థను.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం.. లోకాయుక్త ద్వారా ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురావడం..సిగ్గుచేటు.

భక్తుల మత విశ్వాసాలపై..దాడి
దుర్గానగర్‌లోని శ్రీ కనక దుర్గమ్మ ఆలయం.. స్థానికంగా ఎంతో ప్రాశస్త్యం కల్గి.. భక్తుల పూజలతో కళకళలాడుతూ ఉంటోంది. స్థానిక ప్రజలు.. ఈ ఆలయానికి వచ్చి భక్తితో అమ్మవారిని దర్శించుకుని.. పూజలు చేస్తారు. ప్రతీ ఏటా దసరా సమయంలో అయితే.. భవానీలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలతో దుర్గమ్మను పూజించి తరిస్తారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న షెడ్డులో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు అన్నదానాలు, ప్రసాద వితరణలు ఈ షెడ్డులోనే ఏర్పాటు చేస్తారు. ఇక స్థానిక ప్రజల జీవితాలతో.. ఈ దుర్గమ్మ తల్లి ఆలయానికి విడదీయరాని అనుబంధం ఉంది. అంతటి విశిష్టత.. ప్రజల సెంటిమెంట్‌తో కూడిన దుర్గమ్మ తల్లి ఆలయం షెడ్డును తొలగించాలని బిజెపి నాయకుడు బి. రామచంద్రరావు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం.. కేవలం తన వ్యక్తిగత కక్షతోనే అని అందరికి స్పష్టంగా అర్థమవుతోంది. హిందువులు మత విశ్వాసాలను పరిరక్షిస్తామని ప్రచారం చేసుకునే బిజెపి నాయకులు.. కాతేరులోని దుర్గానగర్‌లో బిజెపి నాయకుడు రామచంద్రరావు వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Comment here