Andhra PradeshEast GodavariNews

ఆర్యాపురం బ్యాంకు..దివాళా?

ఆర్యాపురం బ్యాంకు..దివాళా?
`మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు సంచలన వ్యాఖ్యలు
`బ్యాంకు అధికారులు,సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు
`అక్రమాలకు పాల్పడుతున్నారంటూ..ఆగ్రహం
`సబ్‌ కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా ఉన్న బ్యాంకుపై నిందలా?
`బ్యాంకు డిపాజిట్‌ దారులు, ఖాతాదారుల్లో ఆందోళన
`తమ పాలకవర్గం హయాంలో ఇచ్చిన రుణాల మాటేమిటో?
`మహాలక్ష్మీ సోసైటికి నిబంధనలకు విరుద్దంగా భారీ రుణం
`వాటిలో నాలుగు షాపులు.. సొంతవాళ్లకు దక్కించుకున్నారన్న ఆరోపణలు
ఆయనో నగర ప్రముఖుడు.. పెద్ద మనిషి.. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్‌గా కూడా పనిచేసారు.. ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. స్థాయి మరిచి వ్యాఖ్యలు చేసారు. 100 ఏళ్ల చరిత్ర కల్గిన ది ఆర్యాపురం కో`ఆపరేటివ్‌ అర్భన్‌ బ్యాంకుపై సంచలన ఆరోపణలు చేసారు.దీనిపై బ్యాంకు సిబ్బంది..డిపాజిట్‌ దారులు మండిపడుతున్నారు. ఆర్యాపురం బ్యాంకు మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు విపరీత వ్యాఖ్యలపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ సహకార రంగంలో 100 ఏళ్ల చరిత్ర గల్గిన అగ్రశ్రేణి బ్యాంకు.. రాజమహేంద్రవరంలోని ది. ఆర్యాపురం కో`ఆపరేటివ్‌ అర్భన్‌ బ్యాంకు. వందల కోట్ల టర్నోవర్‌.. డిపాజిట్‌లతో..సుమారు లక్ష మంది ఖాతాదారులతో.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బ్రాంచ్‌లతో.. నడుస్తున్న ఈ బ్యాంకుపై మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏకంగా ఈ బ్యాంకు దివాళా తీసే పరిస్థితికి దిగజారిందంటూ.. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇప్పుడీ మాటలే.. నగరంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. గతంలో ఏ చైర్మన్‌ కూడా ఈ స్థాయిలో తాము చైర్మన్‌లుగా పనిచేసిన బ్యాంకుపై బురద చల్లే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకాశం లాంటి ఆర్యాపురం బ్యాంకుపై ఉమ్మి వేసే ప్రయత్నం చేసారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసిన చల్లా శంకర్రావు పాలక వర్గంపై తీవ్రస్థాయిలో అవినీతి, ఆక్రమాలకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు గత 100 ఏళ్ల చరిత్రలో ఏ చైర్మన్‌పైనా 51 ఎంక్వైరీ పడలేదు. అసలు 51 ఎంక్వైరీ పడిదంటేనే.. అసలా బ్యాంకులో అవకతవకలు.. అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో పాటు అంతో ఇంతో ఆధారాలు ఉన్నాయని తేటతెల్లమవుతోంది. అంటే.. ఆర్యాపురం బ్యాంకును న భూతో..న భవిష్యత్‌ అన్నట్లు అభివృద్ది చేసామని చెప్పుకుంటున్న చల్లా శంకర్రావు పాలక వర్గం హయాంలోనే.. 51 ఎంక్వైరీని ప్రభుత్వం వేయడం అంటే.. 100 ఏళ్ల బ్యాంకు ప్రతిష్ట.. మంట కలిసినట్లు స్పష్టమవుతోంది. ఆర్యాపురం బ్యాంకు చల్లా శంకర్రావు పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత.. ప్రభుత్వం ఆదేశాలతో ప్రత్యేకాధికారి పాలనలోకి వచ్చింది. అటువంటి బ్యాంకుపై.. ఏకంగా దివాళా తీసేస్తుందంటూ ఆరోపణలు చేయడం.. సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఒక పక్క 51 ఎంక్వేరీలో సుమారు 21 అంశాలకు పైగా వచ్చిన ఆరోపణలు, అభియోగాలపై ఏకంగా 5.50 కోట్ల రూపాయల సర్‌ చార్జీగా..మరో కోటి రూపాయలను వడ్డీగా చెల్లించాలని విచారణ అధికారి తేల్చారు. అంటే..చల్లా శంకర్రావు పాలక వర్గం తప్పులు చేసిందని 51 ఎంక్వైరీ తేల్చిందన్న మాట. అయినా..51 ఎంక్వైరీలో పేర్కోన్నవి కేవలం అభియోగాలు, ఆరోపణలు మాత్రమేనని చెప్పడం.. చల్లా శంకర్రావుకే చెల్లింది. అసలు ప్రభుత్వం నియమించే విచారణ కమిటీలు.. ఎవరైనా వ్యక్తులు, లేదా సంస్థలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి.. నిజాలను నిగ్గుతేలుస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. ఈయన మాత్రం.. 51 ఎంక్వైరీ తేల్చింది నిజాలను కాదని.. అవి కూడా ఆరోపణలే అని చెప్పడం విడ్డూరం.
సబ్‌ కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా ఉన్న బ్యాంకుపై.. ఆరోపణలా?
ఆర్యాపురం బ్యాంకు ప్రత్యేకాధికారిగా సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా వ్యవహరిస్తున్నారు. వేలాది మంది ఖాతాదారుల ఆర్థిక స్థితిగతులతో ముడిపడిన ఆర్యాపురం బ్యాంకును.. ఒక సక్రమమైన పద్దతిలో నడిపించే బాధ్యత ఐఏఎస్‌ అధికారులపై ప్రభుత్వమే పెట్టింది. ఒకవేళ వీరి హయాంలో చిన్న చిన్న తప్పులైతే జరగవచ్చేమో కానీ.. ఏకంగా బ్యాంకు పరువును నడిబజారులో నిలబెట్టి.. 51 ఎంక్వైరీ వంటి విచారణలు పడే స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగే అవకాశాలు ఉండవు. అటువంటి ఆర్యాపురం బ్యాంకుపై.. మాజీ చైర్మన్‌ కూడా అయినా చల్లా శంకర్రావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలు.. సిఎం జగన్‌ సారథ్యంలోని ప్రభుత్వంపై చేసినవిగా పలువురు భావిస్తున్నారు. ఇక బ్యాంకులో ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది.. చల్లా శంకర్రావు పాలకవర్గం హయాంలో ఉద్యోగాలు పొందినవారే. ఓ మాజీ డైరెక్టర్‌ ..తన ప్రియురాలికి (భార్య కాదొండోయ్‌) దొడ్డిదారిలో ఈ బ్యాంకులో ఉద్యోగం వేయించుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఇక చల్లా శంకర్రావు పాలకవర్గం హయాంలో ఇచ్చిన రుణాలు (లోన్లు)పైనా అనేక ఆరోపణలు ఉన్నాయి. మహాలక్ష్యి మార్కెట్‌కు సుమారు 60 కోట్ల రూపాయలను రుణంగా అప్పట్లో మంజూరు చేసారు. మోరంపూడి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ షాపుల సముదాయంలో ఓ నాలుగు షాపులను క్విడ్‌ ప్రోకో తరహాలో తమ రక్తసంబంధీకులకు సంపాదించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముగ్థ అనే సంస్థ యజమాని కృష్ణకు..కోట్లాది రూపాయల రుణాన్ని చల్లా పాలకవర్గం ఉదారంగా ఇచ్చింది. ఇటువంటి భారీ రుణాలు.. సక్రమంగా వసూలు కాకపోవడం వల్ల ఎన్‌పిఎలుగా మారాయి. ఇటువంటి రుణాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఇలా చల్లా శంకర్రావు పాలకవర్గం హయాంలో ఇష్టారీతిగా ఇచ్చిన అనేక రుణాలు..వడ్డీలను మాఫీ చేయడం వంటివి బ్యాంకు ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణాలుగా చెబుతున్నారు. ఇక గత రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల కూడా అనేకమంది వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో రిజర్వ్‌బ్యాంకు సైతం ఏడాది పాటు మారటోరియం ప్రకటించింది. దీనివల్ల కూడా రుణాలు, వడ్డీల వసూలులో తగ్గుదల కనిపిస్తుంది. ఇలా ఎన్నో విషయాలు బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపడం వల్ల.. బ్యాంకు ’‘సి’ గ్రేడుకు పరిమితమైందని తెలుస్తోంది. ఈ విషయాలు కాస్త బుర్ర ఉన్న వారెవరికైనా అర్థమవుతాయి. కానీ..వీటన్నింటిని మరుగున పరిచి.. ఎంతో సమర్థవంతంగా బ్యాంకును నడిపిస్తున్న ప్రత్యేకాధికారి సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా వంటి ఐఏఎస్‌ అధికారిణిపై విమర్శలు గుప్పించేలా.. ఇంకా బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు దెబ్బతినేలా.. చల్లా శంకర్రావు లాంటి పెద్దమనిషి దివాళా అంటూ..వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అభివృద్ది తనది..అవినీతి సిబ్బందిది!
చల్లా శంకర్రావు పాలకవర్గం 2013లో బాధ్యతలు చేపట్టింది. వీరి పదవీకాలం 2018తో ముగిసింది. చల్లా పాలక వర్గం ఐదేళ్ల పదవీ కాలంలో.. అభివృద్ది తెగ చేసేసామని చెప్పుకుంటూ వస్తోంది. అంటే.. బ్యాంకు అధికారులు, సిబ్బంది అంకితభావంతోనూ.. బాధ్యతతోనూ పనిచేయకపోతే చల్లా పాలకవర్గం ఇంత అభివృద్ది సాధించేదా? వీళ్లంతా తెగ కష్టపడి పనిచేసేసి.. బ్యాంకును అభివృద్ది చేసేసారా? అభివృద్ది అయితే తమ ఘనతా.. అక్రమాలు అయితే బ్యాంకు సిబ్బందిపైకి నెట్టేయడం..చల్లా శంకర్రావు పాలకవర్గానికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇప్పుడు తమకు అధికారం లేకపోయేసరికి.. బ్యాంకు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని..వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పదవీ కాలం ముగిసినా.. ఇంకా బ్యాంకుపై పెత్తనం చెలాయించాలనుకోవడం.. తమ వంధిమాగధులు బ్యాంకులో చక్రం తిప్పడానికి విశ్వప్రయత్నాలు చేయడం.. బ్యాంకును గబ్చిలాల్లా పట్టుకుని వేలాడేవారు మాత్రమే చేస్తారన్న విమర్శలు ఆర్యాపురం బ్యాంకు విషయంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ తరహా పనులు చేసేవారు ఎంతటి వారైనా.. ప్రత్యేకాధికారి సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా వంటి వారు ఉపేక్షించరాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Comment here