Andhra PradeshEast GodavariNews

ఏపి రాజకీయాల్లో..ముక్కోణపు ప్రేమ కథా చిత్రమ్‌

ఏపి రాజకీయాల్లో..ముక్కోణపు ప్రేమ కథా చిత్రమ్‌
`జనసేనపై వలపు బాణాలు విసురుతున్న టిడిపి,బిజెపి
`ఎంపిటిసీ,జడ్పీటీసి ఫలితాలతో జనసైనికుల్లో నూతనోత్సాహం
`ఏపిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
`వైసిపికి.. ధీటైన ప్రత్యర్థిగా ఎదుగుతున్న జనసేన
`దూకుడు పెంచిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌
`గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారా?
`క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కాకపోతే..కష్టమే
ఏపి రాజకీయాల్లో..ముక్కోణపు ప్రేమ కథా చిత్రమ్‌ మొదలైంది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోవాలంటే..పొత్తుల ప్రేమలు తప్పేలా కనిపించడం లేదు. ఈ ప్రేమ కథా చిత్రమ్‌లో.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన..ప్రధాన ఆకర్షణగా మారింది. దీంతో టిడిపి, బిజెపిలు వలపు బాణాలను విసురుతున్నాయి. 2024 ఎన్నికలకు..ఈ సినిమా విడుదల చేయడానికి.. మూడు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి,రాజమహేంద్రవరంÑఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయాలు..మరోసారి వేడెక్కాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతూ ఉంటుంది. కానీ..ఇటీవల వచ్చిన ఎంపిటీసీ, జడ్పీటీసి ఎన్నికల ఫలితాల తర్వాత.. వాతావరణం మారింది. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. జనసేనల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇటీవల రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు..ఏపి రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. పవన్‌ వ్యాఖ్యలతో..వైసిపి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. సిఎం జగన్‌ ఆదేశాలతో..మంత్రులు ఎదురుదాడి మొదలెట్టేసారు. పవన్‌ కల్యాణ్‌పై.. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
సినిమా నటుడు పోసాని కృష్ణమురళీని రంగంలోకి దింపింది.. వైసిపి. పోసాని మాటలతో.. ఒక్కసారిగా ఏపిలో రాజకీయం మారిపోయింది..వైసిపి.. జనసేనల మధ్య మాటల తూటాలే కాదు.. పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు..భౌతిక దాడులు చేసుకునే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో.. పవన్‌ కల్యాణ్‌ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. వైసిపిని టార్గెట్‌ చేసుకుని..పదునైన మాటలతో.. విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా.. వైసిపి..జనసేన మధ్య రాజకీయ యుద్దం ఏపి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పైకి ఇదంతా.. వైసిపి.. పవన్‌ కల్యాణ్‌ల మధ్య వివాదంగా చెబుతున్నప్పటికీ.. ఇది రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం. అప్పట్లో సినిమా టికెట్ల ధరల విషయంలో.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలను లక్ష్యంగా చేసుకుని వైసిపి ప్రభుత్వం టికెట్ల ధరల నియంత్రణ పేరుతో కుట్రలు చేస్తుందన్న వాదన వినిపించింది. అప్పటి నుంచి ఓ సినిమా నటుడుగా పవన్‌ కల్యాణ్‌ను చూడటం కన్నా.. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆర్థికంగా ఎలా దెబ్బ కొట్టాలన్న విషయంపైనే వైసిపి వర్గాలు దృష్టి సారించాయని అందరికి తెలిసింది. సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత.. రాజకీయ పార్టీలు..నాయకులు ఏం చేసినా..వాటి వెనుక ఉద్దేశాలు, కుయుక్తులు.. ప్రజలకు ఇట్టే అర్థమైపోతున్నాయి. ఈ విధంగా ఏపి రాజకీయాల్లో జనసేన నెమ్మదిగా చాపకింద నీరులా.. విస్తరిస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ఏడాది తొలి నాళ్లలో జరిగిన ఎంపిటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ .. అధికార వైసిపిపై పోరాటం చేయడం మాని..ఎన్నికలను బహిష్కరించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏకగ్రీవాల పేరుతో.. వైసిపి అరాచక చర్యలకు దిగుతుందని.. అభ్యర్థులను బెదిరించి… నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తుందంటూ టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. దీనికి నిరసనగా..ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.అయితే.. ఇక్కడే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన చంద్రబాబు.. చారిత్రక తప్పిదం చేస్తే.. పవన్‌ కల్యాణ్‌ మాత్రం ధైర్యంగా జనసేన తరపున అభ్యర్థులను నిలబెట్టారు. ఈ నిర్ణయం..ఇప్పుడు జనసేనకు కొత్త ఊపిరిలూదుతోంది. అధికార వైసిపితో పాటు ప్రతిపక్ష టిడిపికి.. తమను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్న సంకేతాలు పంపించినట్లయింది.
బిజెపి..టిడిపిల నడుమ జనసేన
ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైసిపిని ఎదుర్కోవడం.. ప్రతిపక్షాలకు కష్టంగా మారింది. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే.. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలతో ప్రజలనే కాదు ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఏడాది పొడవునా.. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులను.. సచివాలయ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తమకు తిరిగేలేదని.. ఏకపక్ష విజయాలు సాధిస్తామని వైసిపి మంత్రులు, నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి కోలుకోవడానికి ప్రతిపక్షాలకు ఇప్పట్లో సాధ్యం కాదనుకుంటున్న తరుణంలో ఏపి వ్యాప్తంగా జనసేన సాధించిన ఫలితాలు.. ఆ పార్టీలో జోష్‌ను నింపాయి. అదే సమయంలో.. జాతీయ పార్టీ బిజెపి..ప్రతిపక్ష టిడిపిలను ఆలోచనలో పడేసాయి. ఈ రెండు పార్టీలకు.. జనసేనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో బిజెపితో.. టిడిపితో పొత్తులు సాగించిన.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆ తర్వాత గత కొంత కాలంగా రెండు పార్టీలతోనూ సమాన దూరాన్ని పాటిస్తూ వచ్చారు. బిజెపితో పొత్తు సాగిస్తున్నట్లు ఉన్నా.. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. లోలోపల పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అప్పటి నుంచి బిజెపికి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో టిడిపితో కలిసి ఉన్నా.. అది కూడా ఆ తర్వాత ముగిసిన కథగా మిగిలింది. అలాగని ఈ రెండు పార్టీలకు పవన్‌ కల్యాణ్‌.. మరీ అంత దూరం అయితే కాలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఏపిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేఫథ్యంలో.. మరోసారి జనసేనపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు. దీనికి తోడు పవన్‌ కల్యాణ్‌ కూడా పార్టీ పటిష్టతపై దృష్టి సారిస్తే..భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు.

సంస్థాగతంగా..
ఏపిలో 2024లో జరగనున్న ఎన్నికల్లో అధికార వైసిపిని ఓడిరచాలంటే.. జనసేన సంస్థాగతంగా మరింత బలపడాలి. బూత్‌ లెవెల్‌లో ఆ పార్టీ నిర్మాణం జరగాలి. ప్రస్తుతం గ్రామ స్థాయి నుంచి తెలుగు దేశం పార్టీ పటిష్టంగా ఉంది. ఆ పార్టీకీ నాయకులు దూరమవుతున్నా.. కార్యకర్తల బలం మాత్రం ఉంది. ఇక బిజెపి కూడా క్షేత్ర స్థాయిలో బలోపేతం కావడానికి.. కమిటీలను వేస్తూ సాగుతుంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు జనసేనపై మక్కువ పెంచుకుంటున్నాయి.పవన్‌ కల్యాణ్‌ చరిష్మాను… వాడుకుని.. జససేనతో కలిసి పోటీ చేయడం ద్వారా వైసిపికి బుద్దిచెప్పాలని భావిస్తున్నారు. అందుకే.. ఏపిలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ.. అంతర్గతంగా జనసేనతో.. టిడిపి, బిజెపిలు అవగాహనతో ముందుకు నడుస్తున్నాయి. ఏది ఏమైనా.. 2024 ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీల మధ్య.. ప్రస్తుతం అంతర్గతంగా సాగుతున్న ముక్కోణపు ప్రేమ కథ.. పక్వానికి వచ్చి.. పొత్తుల రూపు దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.,.. వైసిపి ఈ మూడు పార్టీలను ఎలా ఎదుర్కోంటుందో చూడాలి?

Comment here