Andhra PradeshEast GodavariNews

ఐటిడిఏ ద్వారా అంగన్వాడీలకు పాలు సరఫరా

ఐటిడిఏ ద్వారా అంగన్వాడీలకు పాలు సరఫరా
– చింతూరు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణ వెల్లడి
– తాత్కాలికంగా పాత గోడౌన్ లోనే స్టాక్ ఏర్పాటు
– అనంతరం చింతూరు గోడౌన్ లో స్టాక్ పాయింట్
– రెవెన్యూ శాఖాధికారుల ఆధ్వర్యంలో స్టాక్ నిర్వహణ
– ఐసిడిఎస్ శాఖాధికారుల పర్యవేక్షణలో పాల సరఫరా
– నూతన గుత్తేదారు నియామకానికి సమయం పట్టే అవకాశం…?
– గుత్తేదారు నియామకం తర్వాతే ఐసిడిఎస్ కు పూర్తి స్థాయిలో పగ్గాలు…?
కోస్తా ఎన్ కౌంటర్ ఎటపాక : ఏజెన్సీలో గత రెండు నెలలుగా అంగన్వాడీలకు సరఫరా జరగని పౌష్టికాహారమైన పాలు మరో నాలుగు రోజుల వ్యవధిలో అంగన్వాడీ కేంద్రాలకు చేరబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి చింతూరు ఐటిడిఏ అధికారుల పర్యవేక్షణలో అంగన్వాడీలకు పాలు సరఫరా జరగబోతుందా….? అంటే అవుననే సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో చింతూరు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణ ఆదేశాలతో విలీన మండలాల్లోని 3 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 13 సెక్టార్లలోని అంగన్వాడీ కేంద్రాలకు నేడో రేపో పాలను రెవెన్యూ మరియు ఐసిడిఎస్ అధికారులు సంయుక్తంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల గుత్తేదారు మరియు సరఫరాదారుడు అంగన్వాడీ పాలను వాహనాల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో అధికారులు వారిని తొలగించారు. దీంతో అంగన్వాడీలకు పాల సరఫరా ఆగిపోయి మన్యంలోని ఆదివాసీ చిన్నారులు , బాలింతలు , గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పోషకాహార వారోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమస్యను పలు ప్రజా సంఘాలు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి చర్యలు చేపట్టనున్నారు. దీనిపై విశ్వం వాయిస్ ప్రతినిధి ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణను వివరణ కోరగా ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిమిత్తం రాష్ట్ర స్థాయిలోని విజయ పాల డైరీ వారు నూతన గుత్తేదారును నియమించాల్సి ఉండగా , అందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. నూతన గుత్తేదారును నియమించేది తన పరిధిలోని అంశం కాదన్నారు. అందువల్ల విజయ డైరీ వారు గుత్తేదారుని నియమించేంత వరకు అంగన్వాడీ పాల సరఫరాకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా ఐటిడిఏ అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఎటపాక మండలం గుండాల కాలనీలోని పాల గోడౌన్ ను , వాహనాలను తమ ఆధీనంలోకి తీసుకుని ఎటపాక డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో స్టాక్ నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు పిఓ ఆకుల.వెంకటరమణ మీడియాకు తెలిపారు. 3 ప్రాజెక్టుల పరిధి 13 సెక్టార్లలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం ఇద్దరు సిడిపిఓల పర్యవేక్షణలో సూపర్ వైజర్ల నేతృత్వంలో వాహనాల ద్వారా పాలు సరఫరా జరుగుతుందని పిఓ వెంకటరమణ చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఎంత పాల స్టాక్ అంగన్వాడీ కేంద్రాలకు చేరిందనేది తానే స్వయంగా పరిశీలించనున్నట్టు పిఓ తెలిపారు. అర్హులైన నూతన గుత్తేదారును పాల డైరీ వారు నియమించిన తర్వాతే చింతూరు కేంద్రంగా పాల గోడౌన్ ఏర్పాటు చేసి ఐసిడిఎస్ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా జరిగేలా పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించనున్నట్టు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణ తెలియజేశారు. ఐటిడిఏ పిఓ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో ఇకనైనా అంగన్వాడీ పాల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా చూడాలని ఏజెన్సీ ప్రజానీకం కోరుతున్నారు.

Comment here