Andhra PradeshEast GodavariNews

కోల్డ్‌వార్‌

కోల్డ్‌వార్‌
`ఎంపి భరత్‌,ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య తారాస్థాయికి విభేదాలు
`రెండు వర్గాల మధ్య ముదురుతున్న మాటల యుద్దం
`సీతానగరంలో వరుసగా రెండోసారి దళితులపై దాడి
`మొన్న శిరోముండనం..తాజాగా లెక్చరర్‌ దీపక్‌పై హత్యాయత్నం
`నడిబజారులో పోతున్న వైసిపి పరువు
`రాజానగరంలో కులాల మధ్య రగులుతున్న చిచ్చు
`సిఎం జగన్‌ జోక్యం చేసుకుంటారా?
రాజమహేంద్రవరంలో.. రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య కాదండోయ్‌.. అధికార వైసిపిలోనే వర్గ విభేదాలు రోడ్డుకెక్కాయి. ఎంపి మార్గాని భరత్‌..ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య అంతర్గత యుద్దం..తారాస్థాయికి చేరుతోంది. సీతానగరంలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులు.. ఆగ్రవర్ణాల కుల దురంహంకారానికి నిదర్శనం అన్న భావన బలపడుతోంది. రెండు వర్గాల వారు మాటల యుద్దానికి దిగడంతో.. వైసిపి పరువు గోదాట్లో కొట్టుకుపోతోంది. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ తూర్పుగోదావరి జిల్లాలో..కీలకమైన రాజమహేంద్రవరంలో అధికార వైసిపి పరువు మరోసారి రోడ్డున పడిరది. ఎంపి మార్గాని భరత్‌ రామ్‌..రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు..తారాస్థాయికి చేరింది. రాజానగరం నియోజక వర్గం సీతానగరంలో మొదలైన ఈ చిచ్చు..కార్చిచ్చులా మారి వైసిపిని తగలెట్టేస్తోంది. కోరుకొండ ఆవ భూముల కుంభకోణం నుంచి మొదలైన ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల మధ్య విభేదాలు..చాపకింద నీరులా సాగుతూ..తాజాగాఆ తీవ్ర రూపం దాల్చాయి. ఇంతకీ దీనికి మూలాల్లోకి వెళ్తే.. రాజానగరం నియోజక వర్గం సీతానగరంలో ఇటీవల ప్రభుత్వ లెక్చరర్‌ దీపక్‌పై.. వైసిపికి చెందిన నాయకులు భౌతిక దాడులకు దిగారు. సీతానగరంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న దీపక్‌..స్థానికంగా ఉన్న పురుషోత్త పట్నం రైతులకు అండగా నిలిచి..వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. రైతుల ఆందోళనకు లెక్చరర్‌ పులుగు దీపక్‌ అండగా నిలవడం.. కొందరికి నచ్చి ఉండక పోవచ్చు. ఇదే సమయంలో స్థానికంగా ఉన్న వైసిపి నాయకులకు దీపక్‌ వ్యవహారశైలి..కంటగింపుగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల సీతానగరంలోని ఒక జంక్షన్‌లో దివంగత సిఎం మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డిని స్మరిస్తూ ఒక ఫ్రీజర్‌ను లెక్చరర్‌ దీపక్‌ బహూకరించారు.దీనికి ఎంపి మార్గాని భరత్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించి.. ఆయన చేతుల మీదుగా అందించడం.. ఎమ్మెల్యే రాజా వర్గీయులకు పుండు మీద కారం చల్లినట్లుగా అయిందన్న ప్రచారం సాగుతోంది. గత కొంత కాలంగా రాజానగరం నియోజక వర్గంలో జరిగే ఏ కార్యక్రమానికి ఎంపి భరత్‌ రామ్‌ హాజరుకావడం లేదు. ఎంపి భరత్‌కు ఆహ్వానాలు ఉండటం లేదన్న వాదన ఉంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఉన్న విభేదాల కారణంగా.. ఎంపిని రాజానగరం నియోజక వర్గానికి పిలవడం లేదన్నది పార్టీ వర్గాలకు తెలిసిన విషయం.ఈ విధంగా సాగుతున్న వైరం.. తాజాగా లెక్చరర్‌ పులుగు దీపక్‌ ఉదంతంతో మరోసారి రచ్చ కెక్కినట్లైంది. ఈ నెల 9 వ తేదీన స్థానికంగా ఉన్న సచివాలయం వద్ద.. లెక్చరర్‌ దీపక్‌తో ఎమ్మెల్యే రాజా సమక్షంలోనే స్థానిక వైసిపి నాయకులు వాగ్వివాదానికి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లెక్చరర్‌ దీపక్‌పై భౌతిక దాడికి దిగడంతో పాటు.. ఆయన కారుపై దాడి జరిపి చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
దళితులపై దాడులు
గతంలో సీతానగరంలోనే ప్రసాద్‌ అనే దళిత యువకుడిపై కొందరు కాపు సామాజిక వర్గం వారు దాడిగి దిగడం… ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో ప్రసాద్‌కు శిరోముండనం చేయడం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.ఈ ఘటనలో ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుని.. అసలు నిందితులను పట్టుకోకుండా..పోలీసులు తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ శిరోముండనంపై ఏవిధమైన సమగ్ర విచారణ జరగలేదు. నిందితులకు శిక్షలు పడలేదు. బాథితుడు ప్రసాద్‌కు న్యాయం జరగలేదు. అసలు శిరోముండనం చేసిన పోలీసులకు ఆ సమయంలో ఏ ప్రజా ప్రతినిథి.. అధికార వైసిపి నాయకుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయో ఇప్పటివరకు ప్రభుత్వం బైట పెట్టలేదు. నిందితులు అధికార వైసిపికి చెందిన వారే కావడం.. స్ధానిక ప్రజా ప్రతినిథికి అనుచరులు కావడం వల్లే ఈ కేసును ప్రభుత్వం నీరు గార్చిందన్న అపప్రద సిఎం జగన్‌ ప్రభుత్వంపై పడిరది. తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన లెక్చరర్‌ దీపక్‌పై హత్యాయత్నం జరగడం.. దీనిలో కూడా ప్రజా ప్రతినిథి అనుచరులే ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలా నియోజక వర్గంలో వరుసగా దళితులపై దాడులు జరగడం.. దళిత సామాజిక వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. కొందరు వైసిపిలోని ఎస్సీ నాయకులు.. ప్రజా ప్రతినిథికి వంత పాడుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం అంతర్గతంగా తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఇక పోలీసులు కూడా అధికార పార్టీ ప్రజా ప్రతినిథి చేతుల్లో కీలుబొమ్మలుగా మారి. అసలైన నిందితులను పట్టుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీపక్‌ కేసులో అగ్రకులాలకు చెందిన వారిని కావాలనే పట్టుకోకుండా.. జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మాటల యుద్దం
సీతానగరం నియోజక వర్గంలో మొదలైన వివాదం..చినికి చినికి గాలివానగా మారుతోంది. ఎంపి భరత్‌ రామ్‌.. ఎమ్మెల్యే రాజాల అనుచర గణాలు పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజమండ్రి, సీతానగరం, కోరుకొండలలో ఈ వైసిపి నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ చోటా మోటా నాయకుల మాటలు.. హద్దులు దాటి పార్టీ పరువును నడిరోడ్డుపై బట్టలూడదీస్తున్నాయి. ఇప్పటికే ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల మధ్య ఆధిపత్య పోరులో.. రాజమండ్రిలో నాయకులు, కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాలుగా నలిగిపోతున్నారు. తాజాగా సీతానగరం నియోజక వర్గంలో దళితు లెక్చరర్‌పై జరిగిన దాడి మరోసారి ఈ రెండు వర్గాల మధ్య

అగ్గిని రాజేసింది. ఈ మంటలు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు.

సిఎం జగన్‌.. జోక్యం చేసుకుంటారా?
ఎంపి భరత్‌..ఎమ్మెల్యే రాజాల మధ్య విభేదాలు.. పార్టీలోని నాయకులు, కార్యకర్తలందరికీ తెలుసు. రాజమండ్రిలో పట్టు సాధించడానికి ఎంపి భరత్‌.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాయకులను, కార్యకర్తలను.. సమన్వయ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే.. రాజమండ్రిలో తమ పట్టు సడలకూడదని శత విధాల ప్రయత్నాలు సాగిస్తున్న జక్కంపూడి వర్గం కూడా.. ఎంపి భరత్‌ వర్గానికి చెక్‌ పెట్టడానికి తమకు అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎమ్మెల్యే రాజాతో పాటు సోదరుడు గణేష్‌లు.. ఎక్కువగా రాజమండ్రి పైనే దృష్టి కేంద్రీకరించారన్నది రాజకీయంగా అందరికి తెలిసిన విషయం. దీంతో ఈ రెండు వర్గాలు.. ఒకరిపై మరోకరు సమయం వచ్చినప్పుడల్లా విషం కక్కుకుంటూనే ఉన్నారు.తాజాగా సీతానగరం లెక్చరర్‌ వివాదం.. ఈ రెండు వర్గాల మధ్య ఆగ్నికి ఆజ్యం పోసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరీ.. ఇప్పటికైనా సిఎం జగన్‌.. ఈ ఇద్దరు నేతలకు తగిన హితవు చెప్పి.. ఈ ఆధిపత్య పోరుకు.. అడ్డుకట్ట వేస్తారా? లేదా? అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఇప్పటికే.. ఈ గొడవలకు సంబంధించి పూర్తి నివేదికలను ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు .. ప్రభుత్వానికి నివేదికలు అందించినట్లు సమాచారం. మరీ ఏం జరుగుతుందో చూడాలి.

 

 

Comment here