Andhra PradeshEast GodavariNews

జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన మంత్రి కొడాలి నాని 

– జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన మంత్రి కొడాలి నాని
– మూడు జడ్పీటీసీలను కైవసం చేసుకున్న వైసీపీ
– 27 ఎంపీటీసీ సెగ్మెంట్ లోనూ వైసీపీ విజయం
కోస్తా ఎన్ కౌంటర్, గుడివాడ, సెప్టెంబర్ 19: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) క్లీన్ స్వీప్ చేశారు. నియోజకవర్గం పరిధిలోని గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్ధులు కైవసం చేసుకున్నారు. అలాగే మూడు మండలాల్లో ఎన్నికలు జరిగిన 27 ఎంపీటీసీ సెగ్మెంట్స్ లో కూడా వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. గుడివాడ రూరల్ జడ్పీటీసీగా గోళ్ళ రామకృష్ణ 3 వేల 992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నందివాడ జడ్పీటీసీగా కందుల పద్మకుమారి 9,246 ఓట్ల మెజార్టీతో, గుడ్లవల్లేరు జడ్పీటీసీగా ఉప్పాల హారిక 12,644 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గుడివాడ రూరల్ మండలంలో ఆరు ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎన్నికలకు ముందే దొండపాడు సెగ్మెంట్ ను  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఎన్నికలు జరిగిన చిరిచింతల, చౌటపల్లి, మోటూరు, రామనపూడి, శరీగొల్వేపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నందివాడ మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎన్నికలకు ముందే రుద్రపాక, పోలుకొండ, దండిగానపూడి, తమిరిశ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు జరిగిన నందివాడ, జొన్నపాడు, పుట్టగుంట, అరిపిరాల, తుమ్మలపల్లి, కుదరవల్లి, ఇలపర్రు ఎంపీటీసీ సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికలు జరిగిన 15 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే విజయం సాధించారు. డోకిపర్రు -1, డోకిపర్రు -2, కవుతరం -1, కవుతరం -2, గుడ్లవల్లేరు -1, గుడ్లవల్లేరు -2, వడ్లమన్నాడు,  వెణుతురుమిల్లి, వేమవరం, కూరాడ, శరీదగ్గుమిల్లి, విన్నకోట, అంగలూరు, కల్వపూడి, పెంజెండ్ర ఎంపీటీసీ సెగ్మెంట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గుడివాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ గెల్చుకోవడం ద్వారా మంత్రి కొడాలి నాని సరికొత్త చరిత్రను సృష్టించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ప్రత్యర్థి పార్టీలను చావుదెబ్బ కొట్టారు. సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజలకు వివరించడంలో మంత్రి కొడాలి నాని విజయవంతమయ్యారు. నియోజకవర్గంలోని 27 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో మంత్రి కొడాలి నాని విస్తృతంగా పర్యటించి బహిరంగ సభల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినట్టుగా ఎన్నికల ఫలితాలను బట్టి అర్ధమవుతోంది. ఏ ఒక్క ఎంపీటీసీ సెగ్మెంట్ లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కన్పించలేదు. తొలి రౌండ్ నుండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం మంత్రి కొడాలి నానికి మరింత ప్రతిష్ఠను పెంచాయని చెప్పవచ్చు. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం సీఎం జగన్మోహనరెడ్డి పాలనకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెబుతున్నారు.

Comment here