Andhra PradeshEast GodavariNews

డ్రగ్స్‌..మీడియా..రాజకీయం

డ్రగ్స్‌..మీడియా..రాజకీయం
`ఏపి రాజకీయాల్లో..మాదక ద్రవ్యాల ప్రహసనం
`విజయవాడతో లింకులు..ప్రభుత్వానికి చిక్కులు
`కాకినాడలో బోటు దగ్ధంపై..రాజకీయ మంటలు
`టిడిపి నేత పట్టాభిపై..మత్స్యకారులు,వైసిపి నేతల ఆగ్రహం
`ఓ టివి ఛానల్‌ విలేకరిపై..ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపాటు
`మీడియాను లక్ష్యంగా చేసుకుని..ప్రజా ప్రతినిధుల ప్రతీకారం
`రాజకీయ చదరంగంలో..అనైక్యతతో అస్థిత్వాన్ని కోల్పోతున్న మీడియా సంఘాలు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం..ఏపిలోనూ కలకలం రేపుతోంది.రాజకీయాలను వేడెక్కిస్తోంది. అధికార వైసిపి..ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటల యుద్దానికే కాదు.. భౌతిక దాడులకు కారణమవుతోంది. మధ్యలో మీడియాపైనా.. రాజకీయ నాయకుల బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వేడెక్కిస్తున్న..బోటు దగ్ధం ఘటన..డ్రగ్స్‌ లింకులు..మధ్యలో మీడియాపై చట్టపరమైన చర్యలకు ఫిర్యాదులు..వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ పరిణామాలపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ ఉరుము ఉరిమి ఉరిమి..మంగళం మీద పడ్డట్లు తయారైంది..ఏపిలోని రాజకీయం. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం..ఇప్పుడు ఏపి రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎక్కడో గుజరాత్‌లో పట్టుబడ్డ రూ.9వేల కోట్ల మాదక ద్రవ్యాల రవాణాలో… ఏపిలోని కీలక నగరం విజయవాడతో లింకులు ఉన్నట్లు ఎన్‌సిబి అధికారులు గుర్తించడంతో మొదలైన రచ్చ.. ఇంకా కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు.. అధికార వైసిపిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు,విమర్శలు చేస్తూ..రచ్చ రచ్చ చేస్తున్నారు.ఈ మాదక ద్రవ్యాల రవాణా..వినియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆప్ఘనిస్థాన్‌ నుండి ఢల్లీి కి తరలిస్తున్న మాదకద్రవ్యాలు గుజరాత్‌ లో పట్టుబడగా ఈ కేసుకు ద్వారపూడితో లింక్‌ ఉండటంతో జిల్లా నిఘా వర్గాలు అప్పట్లో అప్రమత్తమయ్యాయి. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా ,వాడకం తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టాయి. రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను మండపేట మండలం ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ తరలించినట్లు అధికారులు గుర్తించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడిరగ్‌ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని దిల్లీకి చేర్చాలనుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ వార్తలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ కలకలం రాజకీయ రంగు పులుముకుంది. మాజీ సిఎం చంద్రబాబు సహా ఆ పార్టీ నాయకులు దీనిని తమ అస్త్రంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. డ్రగ్స్‌ రవాణా..ఇతర కార్యకలాపాల లింకులతో రాజకీయంగా వైసిపిపై ఎదురుదాడి కొనసాగిస్తోంది. దీనిలో భాగంగానే టిడిపి రాష్ట్ర నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరానికి విచ్చేసి.. మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కాకినాడ తీరంలో దగ్థమైన బోటు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. బోటు ప్రమాదానికి, హెరాయిన్‌ అక్రమ రవాణాకు సంబంధం

ఉందని వ్యాఖ్యలు చేసారు. దీనిపై వైసిపి శ్రేణులు..స్థానిక మత్స్యకారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకినాడ టిడిపి కార్యాలయాన్ని ముట్టడిరచారు. దీంతో అక్కడ టిడిపి నాయకులు, మత్స్యకారులు, వైసిపి కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం..తోపులాట చోటుచేసుకున్నాయి. మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ లాంటి వారు రంగంలోకి దిగి.. మత్స్యకారులతో చర్చలు జరపాల్సి వచ్చింది. అదే సమయంలో పట్టాభి వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిఎం జగన్‌ పైనా.. వైసిపిపైనా ఇష్టారీతిగా మాట్లాడితే.. తగిన రీతిలో బుద్ది చెబుతామని అంటూనే తామేమి గాంధీలం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ పరిణామాలు.. జిల్లా వ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ విధంగా కాకినాడ కేంద్రంగా వైసిపి,టిడిపిలు పరస్పరం మాటల యుద్దంతో ఆగలేదు..భౌతిక దాడులకు దిగడం గమనార్హం.
మీడియా లక్ష్యంగా..
ఇదిలా ఉండగా..ఉరుము ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు.. ఈ సారి వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీడియాను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలోనే రెచ్చిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా అన్నట్లు ఒక మీడియా చానల్‌లో కథనం వచ్చింది. దీనిపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆ మీడియా చానల్‌ ప్రతినిథిని లక్ష్యంగా చేసుకుని..నేరుగా మాట్లాడటమో..లేదా చట్టపరంగా ముందుకు వెళ్లడమో చేసి ఉంటే మీడియా సంఘాలు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ..మీడియా వారిని కించపరిచేలా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం.. దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత ఆయన సర్ధుకుని ఉండవచ్చు. సదరు మీడియా చానల్‌ వారిపై కాకినాడ పోర్టు నందు సర్వీసులు చేస్తున్న సాన్‌ మెరైన్‌ సంస్థ మేనేజింగ్‌ పార్టనర్‌ షేక్‌ అహ్మద్‌ ఆలీషా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. ఇలా..మీడియాలో తమకు వ్యతిరేకంగా కథనాలు వస్తే.. వారిని బెదిరించడమో…లేదా లీగల్‌ నోటీసుల ద్వారా బెదిరించడమో వంటి చర్యలకు రాజకీయ నాయకులు, ప్రతినిథులు దిగడం.. దారుణం. ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ మీడియా సమావేశం నిర్వహించి స్థానిక ప్రజా ప్రతినిథిపై ఆరోపణలు చేసారు. వీటిని ప్రచురించిన లేదా ప్రసారం చేసిన ఐదారు పత్రికల విలేకరులకు సదరు ప్రజా ప్రతినిథి లీగల్‌ నోటీసులు పంపించడం.. చర్చనీయాంశంగా మారింది. కాకినాడలో జర్నలిస్టు సంఘాలు రెండుగా చీలిపోయి..రాజకీయ నాయకులకు అనుకూలంగా ఒక వర్గం.. వ్యతిరేకంగా మరో వర్గం తయారవ్వడం సిగ్గుచేటు. ఈ విధంగా జర్నలిస్టు సంఘాల మధ్య ఐకమత్యం లేక పోవడం వల్ల.. జర్నలిజం నడిబజారులో వలువలు లేని దీనస్థితిలోకి చేరింది. ఏపిలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా.. రాష్ట్రంలోని జర్నలిస్టులకు గౌరవంగా ఇచ్చే అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు. దీనిపై జర్నలిస్టు సంఘాలు పెద్దగా పోరాడిరదీ లేదు. అసలు జర్నలిజంలో.. విలువలకు తిలోదకాలిచ్చేసిన వారు కొందరు ఉండవచ్చు. రాజకీయ నాయకులు విసిరే ఎంగిలి మెతుకులకు అలవాటు పడిన కొందరు.. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారు. దీనివల్లే.. మీడియా అంటే విలువ, గౌరవం లేకుండా పోయింది. కలిసి కట్టుగా ఉంటే.. గడ్డిపరకలు కూడా ఏమి చేయగలవో మన పెద్దలు చెప్పిన సత్యాన్ని..నేటి మీడియా సంఘాలు,ప్రతినిధులు గుర్తించకపోవడం నేటి సమాజంలోని జర్నలిజం దౌర్భాగ్యం.

నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని సుధాకర్‌ ప్రారంభించినట్లు తెలుస్తుంది. దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు దర్యాప్తు సంస్థ లు నిర్ధారణకొచ్చాయి. ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌ ఇందులో పాత్రధారి కావడంతో ఇప్పుడు ఈ అంశం జిల్లా లో సంచలనంగా మారింది. తన భార్య పేరిట ఆషీ ట్రేడిరగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్‌ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతై.. కాకినాడ పోర్టు ద్వారా దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నెల 15న గుజరాత్‌ లోని ముంద్రాలో హెరాయిన్‌ పట్టుబడిన వెంటనే డీఆర్‌ఐ అధికారులు సత్యనారాయణపురంలోని సుధాకర్‌ అత్తవారింట్లో సోదాలు జరిపారు. అయిదు రోజుల కిందట సుధాకర్‌, అతని భార్య వైశాలిని అదుపులోకి తీసుకుని, వివిధ అంశాలపై ప్రశ్నించారు.

 

Comment here