Andhra PradeshEast GodavariNews

దేవీ నామస్మరతో మార్మోగుతున్న ఆలయాలు

దేవీ నామస్మరతో మార్మోగుతున్న ఆలయాలు

కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కోవిడ్‌ నిబంధనల ననుసరించి ఉత్సవ కమిటీలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని దేవీ నామస్మరణతో అమ్మవార్ల ఆలయాలు మార్మోగుతున్నాయి. పట్టణంలోని 17వ వార్డులో వేంచేసియున్న శ్రీవిశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ఉత్సవమూర్తి గాయత్రీదేవిగా అలంకరించారు. మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గొర్రెల శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. రామచంద్రరావుపేట శ్రీకృష్ణయోగా ధ్యాన మందిరంలోని చింతామణెమ్మవారిని ఉత్సవమూర్తి ధాన్యలక్ష్మిగాను, సాయంత్రం గజలక్ష్మిదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీవాసవి మాతను ఉత్సవమూర్తి గజలక్ష్మీదేవిగాను, విశేషాలంకారం ధాన్యలక్ష్మిగాను అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ఉమాచంద్రశేఖరస్వామివారికి సోమవారం కావడంతో అభిషేకాలు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష పత్రి పూజ నిర్వహించారు. వీకర్స్‌ కాలనీ గాయత్రినగర్‌లో వేంచేసియున్న శ్రీగాయత్రీదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. మండలంలోని ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మవారిని శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. చండీహోమం, పుష్పార్చన, సహస్ర కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మాకా బాలాజీ, ఆలయ మేనేజర్‌ నామా సూర్యప్రకాశరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వీరంపాలెం శైవక్షేత్రంలోని శ్రీబాలాత్రిపుర సుందరీ అమ్మవారిని స్కంధమాతగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు వీరంపాలెంలో అక్షరాభ్యాసాలు :
వీరంపాలెం శైవక్షేత్రంలో ఈ నెల 12వ తేది మూలానక్షత్రం, అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి తెలిపారు. అక్షరాభ్యాసాల్లో పాల్గొనే భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటించి మాస్క్‌, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Comment here