Andhra PradeshEast GodavariNews

*ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఉరి శిక్ష

*ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఉరి శిక్ష*
*కందుకూరి విద్యా సంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేయాలి*
*ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల.వెంకటేశ్వరరావు ధ్వజం*
కోస్తా ఎన్ కౌంటర్..రాజమండ్రి:-
ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఉరి శిక్షగా మారిందని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థలు దిగజారిపోతున్నాయనే నెపంతో ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు సాగిస్తుందన్నారు. ఇందులో భాగంగానే జీవో నెంబర్‌ 52ను జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద విద్యార్థుల విద్యకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను నిలుపుదల చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వానికి ధారాదత్తం చేయాలని, ప్రభుత్వానికి ఇవ్వని విద్యా సంస్థలు ప్రైవేటుగా నిర్వహించుకోవాలని చెప్పడం దారుణమైన చర్యగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ నేడు ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఉరిశిక్షగా మారిందని, తన బలంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసుకునేందుకు జగన్‌ సర్కారు సిద్ధమౌతుందని అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం నిజాయితీగా ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ఉన్న స్థిర, చర ఆస్తులను ప్రభుత్వానికి దఖలు చేయాలని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటీ బహిరంగంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ప్రైవేటు పరం చేసేందుకు చేస్తున్న విధానం సరికాదని, దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్‌  కళాశాలు, ఎస్‌కెవిటి కళాశాలలను ప్రభుత్వంలో విలీనం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వాహణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతకు ముందుగా ఎస్‌కెవిటి కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజబాబు, యుటిఎఫ్‌ జిల్లా నాయకుడు రూపస్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి పవన్‌, ఎన్.రాజ,  అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జెడి ప్రకాష్‌, తులసీరామ్‌ మాట్లాడారు.  ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి.రాంబాబు, కళాశాల సిబ్బంది పాల్గున్నారు.

Comment here