Andhra PradeshEast GodavariNews

“మండలంలో అటకెక్కిన పారిశుధ్యం – డంపింగ్ యార్డుల్లా గ్రామీణ రోడ్లు”.

“మండలంలో అటకెక్కిన పారిశుధ్యం – డంపింగ్ యార్డుల్లా గ్రామీణ రోడ్లు”.
కోస్తా ఎన్ కౌంటర్ కడియం
కడియం … మండలంలో పారిశుధ్యం అటకెక్కింది. అపారిశుధ్యం విలయతాండవం చేస్తోంది. గ్రామీణరోడ్లన్నీ డంపింగ్ యార్డుల్లా మారి కంపుకొడుతున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన పారిశుధ్యం కొరకు అనేక పధకాలు ప్రవేశపెట్టి , అధిక నిధులు వెచ్చిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం , సిబ్బంది సమన్వయలోపంతో మెరుగైన పారిశుధ్యం జేగురుపాడు , మురమండ గ్రామాలను మినహాయిస్తే ప్రజలకు ఆమడ దూరంలోనే ఉంది. ఇక వేమగిరి , కడియం గ్రామాలలో అయితే సేకరించిన చెత్త పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తెచ్చి ప్రధాన పంటకాలువ వెంబడించి డంప్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్ & బి , ఇరిగేషన్ , పంచాయతీ రాజ్ ఏ శాఖకు చెందిన ఖాళీ జాగా కన్పిస్తే పంచాయతీ వారు పోటీపడి మరీ చెత్తతో నింపేస్తున్నారు. దీని కారణంగా వస్తున్న తీవ్ర దుర్గంధం , దుర్వాసన లతో ప్రయాణీకులు బెంబేలెత్తుతున్నారు. అలాగే ప్రజలు అంటువ్యాధులు , విషజ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పగలు ఈగల మోత , రాత్రిళ్ళు దోమల వాతలతో కంటిమీద కునుకు లేకుండా నిద్రలేమితో ప్రజలు సతమతమవుతున్నారు. అధిక జన సాంద్రత , వలస కూలీలు , చుట్టుప్రక్కల గ్రామాలనుండి నర్సరీ పనులకు వచ్చు వేలాదిమంది కూలీలు , వివిధ రాష్ట్రాల నుండి నిత్యం వచ్చిపోతున్న వ్యాపారులతో రద్దీగా ఉండే కడియం మండలం రాష్ట్రంలో ఎక్కడ సీజనల్ వ్యాధులు సంభవించినా ముందు వరుసలో ఉంటుంది. అందుచేత మండలంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని , రోగాల నుండి ప్రజలను కాపాడాలని , పారిశుధ్య నిర్వహణ పై ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Comment here