Andhra PradeshEast GodavariNews

మాదక ద్రవ్యల అక్రమ రవాణా పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి

మాదక ద్రవ్యల అక్రమ రవాణా పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి

కేంద్ర హోంశాఖ వైఫల్యం

మాజీ ఎంపీ జివి హర్షకుమార్

కోస్తా ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం క్రైమ్ :

దేశంలోకి అక్రమంగా దిగుమతైన మాదక ద్రవ్యాల వ్యవహారంతో పాటు, దాని వెనుక సూత్ర ధారులను, పాత్ర ధారులను తక్షణం విచారణ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు జివి హర్షకుమార్ డిమాండ్ చేసారు. రూ. 72 వేల కోట్ల విలువైన 25 టన్నుల హెరాయిన్ ఖచ్చితంగా కేంద్ర హోమ్ శాఖ నిఘా వైఫల్యం వల్లనే భారత్ లోకి దిగుమతి అయ్యాయని ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆఘ్ననిస్థాన్ నుంచి ఈ హెరాయిన్ దిగుమతి అయ్యిందని, ఇప్పటికే దేశంలోకి చాలా ప్రాంతాలకు విచ్చలవిడిగా సరఫరా చేసినట్టు ఇప్పటికే డిఆర్ అధికారులు గుర్తించారన్నారు. దీని వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా మంది ఉన్నారన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.అందరూ నిందితుల్ని కాపాడటానికి తమ వంతు ప్రయత్నం చేస్తుండటం ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఇంత భారీఎత్తున మాదక ద్రవ్యాలు ఆదానీ నిర్వహణలో ఉన్న గుజరాత్ పోర్టుకు అక్కడ నుంచి కాకినాడ పోర్టుకి చేరాయంటే దీని వెనుక ఖచ్చితంగా పెద్ద వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. ఎన్ఐఎ సమగ్ర విచారణ జరిపిస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అసలు ఈ డ్రగ్స్ అన్ని ప్రజల మధ్యకు చేరి ఎంత పెద్ద విపత్తు సంభవిస్తుందన్న దానిపై ఆలోచన చేయాలని కోరారు. తక్షణం ఎక్కడికక్కడ దాడులు నిర్వహించి ఎవరి వద్ద మాదక ద్రవ్యాలు నిల్వ చేసారో వాటిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ల వ్యవస్థ లేకపోతే అభివృద్ధి కనబడదని మరీ ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించకుండా ఎందుకు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కళాశాలలకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ విషయంలో కూడా ఇలాగే ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు. తమ కళాశాలకు రూ 3 కోట్ల బకాయిలు ఉన్నాయని ఇలాగైతే విద్యావ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీసారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటో తెలియడం లేదన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వానికి ఎందుకొచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు లక్ష వరకు తొలగించారని వారందరూ గగ్గోలు పెడుతున్నారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు అందర్నీ బాధ పెట్టి మీరు మాత్రం ఏం బాగుంటారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లోప భూయిష్టంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలన చూస్తేనే భయం వేస్తోందని, పెంచిన పన్నులు కట్టలేక ప్రజల్లో తిరుగుబాటు రావడం ఖాయమన్నారు.

Comment here