Andhra PradeshEast GodavariNews

రాజకీయ యుద్దం

రాజకీయ యుద్దం
`రాజమండ్రిలో తారాస్థాఇయికి ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల ఆధిపత్య పోరు
`వైసిపిలో ముదురుతున్న విభేదాలు
`నాయకుల వరుస మీడియా సమావేశాలతో.. వేడెక్కుతున్న రాజకీయం
`నిశితంగా గమనిస్తున్న వైసిపి అధిష్టానం
`సిఎం దృష్టికి..ఎంపి, ఎమ్మెల్యేల పంచాయతీ
`ప్రజా ప్రతినిథుల ఆటలో..కార్యకర్తలే పావులు
`అధికారం మత్తులో..కనిపించని నిజాలు
సిఎం జగన్‌ రెక్కల కష్టం.. బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందా?..జగనన్న చరిష్మాతో ..గెలిచి ప్రజా ప్రతినిథులుగా చలామణి అవుతున్న వారు..జనాల్లో పార్టీ పరువుతో చెలగాట మాడుతున్నారా?..అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజమండ్రిలో ఎంపి మార్గాని భరత్‌ రామ్‌.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య కోల్డ్‌వార్‌..తీవ్ర రూపం దాల్చింది. సిఎం జగన్‌ జోక్యం తప్పేలా కనిపించడం లేదు. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరంటారు.. దీన్ని నిజం చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్‌ రామ్‌..రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వీరిద్దరూ.. సిఎం జగన్‌ రెక్కల కష్టంతో ప్రజా ప్రతినిథులుగా.. నాయకులుగా పదవులను అనుభవిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎంత డబ్బులు ఖర్చు చేసినా.. 2019 ఎన్నికల్లో మాత్రం సిఎం వైఎస్‌.జగన్‌ చరిష్మాతోనే గెలిచారన్నది.. అందరికీ తెలిసిన వాస్తవం. రాజమండ్రి రాజకీయాల్లో.. సీనియర్‌ నాయకులు,మాజీ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా వీరిద్దరికీ.. సిఎం జగన్‌ అధిక ప్రాధాన్యత కల్పించి.. ఉన్నత పదవులను కట్టబెట్టారు. ఎంపి మార్గాని భరత్‌ రామ్‌కు.. లోక్‌సభలో ఛీప్‌ విప్‌గా.. ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఇక జక్కంపూడి రాజాకు కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవిని అందించారు. ఈ పదవిని ఇటీవలే మరొకరికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇద్దరు యువ నాయకులను..తనతో పాటు రాజకీయంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు సిఎం జగన్‌ ప్రయత్నిస్తుంటే..ఇక్కడ మాత్రం ఈ ఇద్దరు నాయకులు..ఆధిపత్య పోరులో వైసిపి వరువును రోడ్డుకీడుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రాజానగరం నియోజక వర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం ఆవ భూములను సేకరించినప్పుడే.. జగన్‌ ప్రభుత్వం పరువు గోదాట్లో కలిసి పోయింది. ప్రజా ధనాన్ని.. ముంపు బారిన పడే ఆవ భూములను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసినప్పుడే.. ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఎంతటి బాధ్యతయుతంగా వ్యవహరించారో జనాలకు అర్థమైపోయింది. ఎకరం కనీసం రూ.7 లక్షలు చేయని భూములను రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేయడంతో ఆవ భూముల స్కామ్‌..రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కుంభకోణంలో సుమారు 150`200 కోట్ల రూపాయలను క్విడ్‌ ప్రోకో తరహాలో దోచేసారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. ఈ సమయంలోనే ఎంపి భరత్‌.. ఎమ్మెల్యే రాజాల మధ్య అభిప్రాయ భేదాలు.. విభేదాలు మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆవ భూముల కుంభకోణం..సిఎం జగన్‌ సర్కార్‌కు మాయని మచ్చగా మిగిలింది. ఈ క్రతువలో ప్రజా ప్రతినిధులే కాదు.. అధికారులు ప్రజా ధనాన్ని పంచుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
కులాల రాజకీయం
ఎంపి భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య వైరం.. కులాల మధ్య కార్చిచ్చులా మారింది. ఇటీవల వారం రోజులుగా రాజమండ్రి నగరంతో పాటు రాజానగరం నియోజకవర్గంలో కొందరు కింది స్థాయి నాయకులు.. వివిధ కుల సంఘాల ప్రతినిధులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపి భరత్‌..ఎమ్మెల్యే రాజాలకు వత్తాసు పలుకుతూ…పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వీరి మాటలు..హద్దులు దాటుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు సైతం దారితీస్తున్నాయి.ఎంపి భరత్‌..ఎమ్మెల్యేల మధ్య వైరం.. తమ వ్యక్తిగత కక్షలుగా అన్నట్లు వీరంతా తెగ రెచ్చిపోతున్నారు. ఈ పరస్పర విమర్శలు…ఆరోపణలు పార్టీలోని సీనియర్‌ నాయకులు.. కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తున్నాయి.వైసిపి పరువును రోడ్డున పడేస్తున్నారన్న ఆవేదన.. సీనియర్‌ నేతల్లో కనిపిస్తోంది. ఎస్సీల మీద దాడులు జరిగితే..ఎస్సీ నాయకులను.. ఎస్టీల మీద దాడి జరిగితే..ఎస్టీ నాయకులను.. రంగంలోకి దింపి విమర్శల దాడి చేయించడం నేటితరం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. రాజానగరం నియోజక వర్గంలోని సీతానగరంలో లెక్చరర్‌ పులుగు దీపక్‌పై జరిగిన దాడిలో నిందితులుగా పోలీసులు కేసులు నమోదు చేసిన వారిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారినే అరెస్టు చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ కేసులో ఆగ్ర కులాలకు చెందిన వారు ఉన్నప్పటీకీ వారిని సదరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే.. పోలీసులకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ద్వారా రక్షిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం…తమ రాజకీయ మనుగడ కోసం కులాలను వాడుకుంటున్నారన్న మాట. ఈ రాజకీయ క్రీడలో..కొందరు కుల సంఘాల నాయకులు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తమ నాయకులు ఎలా చెబితే..అలా చేస్తూ తానా.. అంటే తందానా అంటూ పబ్బం గడుపుకుంటున్నారు.
రాజకీయ రంగు
సీతానగరంలో లెక్చరర్‌ దీపక్‌పై దాడి ఘటన.. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ఖండిరచాల్సిందే. లెక్చరర్‌ దీపక్‌పై కేసులు ఉండవచ్చు.. అతడు గతంలో పలు తప్పులు చేసి ఉండవచ్చు.కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు. ఇక ఈ దాడిలో ప్రధాన నిందితుడుగా ప్రచారం సాగుతున్న బైర్రాజు ప్రసాద రాజు ఏ పార్టీకీ చెందిన వారు? అన్న చర్చ నడుస్తోంది. రాజానగరం నియోజక వర్గంలో తన వర్గాన్ని పెంచుకోవాలని.. రాజకీయంగా కూడా పట్టు సాధించాలని ఎంపి భరత్‌ భావించవచ్చు.లెక్చరర్‌ దీపక్‌పై జరిగిన దాడిని ఖండిరచవచ్చు. ఈ దాడిలో పాల్గొన్న వారెవరో..ఎంపి భరత్‌కు ఖచ్చితంగా తెలుస్తుందన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ దాడిలో ఎమ్మెల్యే రాజా వర్గానికి చెందిన నాయకులు ఉన్నారని అందరికి తెలుసు. కానీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని ఎంపి భరత్‌ మీడియా సమావేశంలో అనడం.. అది బైర్రాజు ప్రసాదరాజును ఉద్దేశించే అనడం గమనార్హం. తన మాటల ద్వారా ప్రతిపక్ష టిడిపిని టార్గెట్‌ చేసినట్లు ఎంపి భరత్‌ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ.. ఈ ప్రయత్నాన్ని కేవలం గంట వ్యవధిలోనే జక్కంపూడి వర్గానికి చెందిన మరుకుర్తి కుమార్‌ యాదవ్‌ తదితరులు తిప్పికొట్టారు. లెక్చరర్‌ దీపక్‌ కారుపై దాడిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న బైర్రాజు ప్రసాద రాజు వైసిపికి చెందిన వారేనని కుండబద్దలు కొట్టారు. దీంతో ఎంపి భరత్‌.. అవగాహానా రాహిత్యం బట్టబయలైంది. ఈ విధంగా ఇద్దర నాయకుల మధ్య సాగుతున్న ప్రచ్చన్న యుద్దంలో.. నాయకులు, కార్యకర్తలు పావులుగా మారుతున్నారు.
సిఎం జగన్‌ చెంతకు పంచాయతీ
రాజమండ్రిలో కాక రేపుతున్న ఎంపి భరత్‌..ఎమ్మెల్యే రాజాల మధ్య కోల్ద్‌వార్‌.. వైసిపి అధినాయకత్వానికి చేరింది. సిఎం జగన్‌ చెంతకు ఈ పంచాయతీ చేరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్‌.. స్పెషల్‌ బ్రాంచ్‌ల ద్వారా పూర్తి సమాచారాన్ని రప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇద్దరు నాయకులకు తలంటే కార్యక్రమానికి రంగం సిద్దం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకరిని ఒకరు దెబ్బ తీసుకోవడానికి అన్నట్లు ఎంపి భరత్‌..ఎమ్మెల్యే రాజాలు వ్యవహరిస్తున్న తీరు.. మొత్తం పార్టీకే తీరని నష్టం చేకూరుస్తుందన్న భావన కింది స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో జరగనున్న కార్పోరేషన్‌ ఎన్నికల్లో పడే ప్రమాదం కూడా ఉందని రాజకీయవిశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ప్రచ్చన్న యుద్దానికి సిఎం జగన్‌ ఏ విధంగా ముగింపు పలుకుతారో వేచి చూడాలి.

Comment here