Andhra PradeshEast GodavariNews

రెండుగా చీలిన.. వైసిపి

రెండుగా చీలిన.. వైసిపి
`రాజమండ్రిలో ఎంపి భరత్‌,ఎమ్మెల్యే రాజాల మాటల యుద్దం
`అధికార పార్టీలో అంతర్గత విభేదాలు..ఆగని ఆధిపత్యపోరు
`రెండు ముక్కలైన పార్టీ నాయకులు..కార్యకర్తలు
`ఇద్దరి నేతల రాజకీయంలో..నలిగిపోతున్న సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు
`మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సారథ్యంలో కానరాని వివాదాలు
`సీనియర్‌ నాయకులను విస్మరించినందుకు..పోతున్న పార్టీ పరువు
`ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందా..వైసిపి అధిష్టానం?
`కార్పోరేషన్‌ ఎన్నికల ముందు..విభేదాలను పరిష్కరిస్తుందా?
గోదావరి జిల్లాల్లో కీలకమైన రాజమహేంద్రవరంలో.. అధికార వైసిపి నిలువునా చీలింది. ఎంపి మార్గాని భరత్‌ రామ్‌..ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల ఆధిపత్యపోరులో.. పార్టీ పరువు మట్టి కొట్టుకుపోతోంది. ఇద్దరు యువ నాయకులే కావడం.. ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన ఈర్ష్యా ద్వేషాలు..వైసిపి భవిష్యత్తును దెబ్బతీసేలా మారాయి. సీనియర్‌ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వక పోవడం..యువ నాయకులు ఒంటెద్దు పోకడలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిణామాలపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ రాజకీయాల్లో ఎక్కడైనా.. అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష నేతలు మాటల యుద్దం చేస్తారు. విమర్శలు..ఆరోపణలతో విరుచుకుపడతారు. కానీ.. ఏపిలో పలు జిల్లాల్లో మాత్రం.. అధికార పార్టీ నాయకులే కత్తులు దూస్తూ ఉంటారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఎదురుదాడులు చేసుకుంటూ ఉంటారు. పార్టీ పరువును.. నడిబజారులో పూచిక పుల్త కన్నా దారుణంగా తీసేస్తూ ఉంటారు. దీనికి తామేమి అతీతులం కామని.. రుజువు చేస్తున్నారు.. రాజమహేంద్రవరం యువ ఎంపి మార్గాని భరత్‌ రామ్‌.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా చాపకింద నీరులా సాగుతూ వచ్చిన అంతర్గత యుద్దం.. గత పది రోజులుగా హద్దులు దాటుతోంది. వీరిద్దరి ఆధిపత్య పోరు.. అటు అధిష్టానం.. ఇటు పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఇద్దరి నాయకుల దుందుడుకు.. అనాలోచిత చర్యల వల్ల రాజమహేంద్రవరంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలువునా చీలి… రెండు ముక్కలైంది. దీని ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు నియోజక వర్గాలపై పడనుంది. రాజానగరం నియోజక వర్గం సీతానగరంలో పుట్టిన ముసలం.. దావానలంలా ఇటు రాజమండ్రి నియోజక వర్గాన్ని చుట్టేస్తోంది. ఎవరో పార్టీకి సంబంధం లేని పులుగు దీపక్‌ అనే లెక్చరర్‌ విషయంలో.. ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల అత్యుత్సాహం.. వివాదస్పదంగా మారింది. దీంతో గత పదిరోజులుగా మీడియా సాక్షిగా.. వైసిపి రెండుగా చీలిపోయింది. గడిచిన కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న మీడియా సమావేశాలు..పార్టీలోని నాయకులు , కార్యకర్తలు ఎంపి భరత్‌ వర్గమా? ఎమ్మెల్యే రాజా వర్గామా? అన్న విషయాన్ని బట్టబయలు చే
సాయి. దీంతో రెండు వర్గాలుగా రాజమండ్రిలో పార్టీ ముక్కలైందని పలువురు నాయకులు, కార్యకర్తలు, దివంగత సిఎం, మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి, సిఎం జగన్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా… పార్టీ జిల్లా ఇన్‌చార్జి, టిటిడి చైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డి గానీ.. ఇతర పెద్దలు గానీ జోక్యం చేసుకోకపోవడం..పార్టీ వర్గాలను సైతం ఆయోమయానికి గురిచేస్తోంది. ఇద్దరు యువ ప్రజా ప్రతినిధులు.. సంయమనం కోల్పోయి.. నువ్వెంతా.. అంటే నువ్వెంతా? అంటూ బహిరంగంగానే మాటల యుద్దానికి దిగుతూ ఉంటే.. ఈ ఘర్షణ పూరిత వాతావరణాన్ని చల్లబర్చే ప్రయత్నాలు చేయకపోవడంపైనా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంపి భరత్‌.. ఎమ్మెల్యే రాజాలు ఎవరికి వారే అధిష్ణానం వద్ద.. పార్టీ పెద్దల వద్ద తమకు ఎంతో పట్టు ఉందన్న సంకేతాలను పార్టీ శ్రేణుల్లో ప్రచారం చేస్తూ ఉండటంతో.. నాయకులు,కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సిఎం జగన్‌ సీరియస్‌
ఎంపి భరత్‌..ఎమ్మెల్యే రాజాల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. ప్రధాన పత్రికలు.. మీడియా చానళ్లలోనూ పార్టీకి చేటు తెచ్చేలా ఇద్దరి నాయకుల తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సిఎం జగన్‌ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇద్దరి నేతల మీడియా సమావేశాలు.. వారి అనుచర వర్గాల దూషణాల పర్వాలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌..స్పెషల్‌ బ్రాంచ్‌ వర్గాలు సిఎం జగన్‌ దృష్టికి.. ప్రభుత్వానికి చేరవేస్తునే ఉన్నాయి. అసలు ఈ మొత్తం వ్యవహరంలో ఎవరిది తప్పు? ఎందుకు ఏ మాత్రం పార్టీ క్రమశిక్షణను పట్టించుకోకుండా..ఈ స్థాయిలో హద్దులు దాటి.. రెచ్చిపోతున్నారు? అన్న విషయాలపై పార్టీ అధినాయకత్వం లోతుగా విచారిస్తోంది.దీనికి ప్రభుత్వ పోలీస్‌, నిఘా వర్గాల సమాచారాన్ని క్రోడీకరించి.. ముఖ్యమంత్రి జగన్‌కు నివేదికను అందించనున్నారు. దీనిని పరిశీలించిన అనంతరం.. ఈ ఇద్దరి నేతల పంచాయతీని తేల్చాలని సిఎం జగన్‌ భావిస్తున్నట్లు తాడేపల్లిలోని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
సీనియర్‌ నేత రౌతు హయాంలో..
రెండు సార్లు రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన రౌతు సూర్యప్రకాశరావును అప్పట్లో నగర పార్టీ కో`ఆర్డినేటర్‌గా సిఎం జగన్‌ నియమించారు. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి వెంట కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పయనించిన రౌతు.. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్‌,, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావులతో కలిసి పార్టీకీ, ప్రజలకు విశేష సేవలందించారు. ఎన్నికలకు ముందు వైసిపి సమన్వయ కర్తగా పనిచేసిన రౌతు.. పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు కృషిచేసారు. వర్గాలతో సంబంధం లేకుండా.. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ రాజమండ్రిలో వైసిపిని పటిష్టం చేసారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఏపి వ్యాప్తంగా జగన్‌ ప్రభంజనం వీచినా.. సొంత పార్టీలోనే కొందరు నేతల వెన్నుపోటు వల్ల రౌతు.. ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. వైసిపి ఆవిర్భావానికి ముందు ఆనాడు త్రిమూర్తులుగా తొలుత ఉండవల్లి అరుణ కుమార్‌..జక్కంపూడి రామ్మోహన రావు..రౌతు సూర్య ప్రకాశరావు కాంగ్రెస్‌ పార్టీనీ.. ఆ తర్వాత కందుల దుర్గేస్‌ లాంటి సమర్థవంతమైన నాయకుల సహకారంలో నగరంలో ఏవిధమైన విభేదాలకు..వివాదాలకు తావులేకుండా పార్టీని సమర్థవంతంగా విజయాల బాటలో నడిపించారు. ఇప్పుడేమిటిరా అంటే.. రాజమండ్రిలో అధికార వైసిపి పరువును దిగజార్చేలా రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితి వచ్చిందని పలువురు సీనియర్‌ నాయకులు వాపోతున్నారు.నేడు మాత్రం పార్టీలో కొత్త నీరులా వచ్చిన ఈ యువ నాయకుల విపరీత పోకడలతో .. వైసిపి ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టాలు..నష్టాలు అనుభవించి పార్టీ జండాను మోసిన సీనియర్‌ నాయకులు అనామకులుగా మిగిలిపోయారు. సీనియర్‌ నేతలను విస్మరించడం.. పూర్తిగా వైసిపి అధినాయకత్వం చేసిన తప్పు. వారిని అస్సలు పట్టించుకోకుండా.. మితిమీరిన గర్వంతో మిడిసి పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా.. వైసిపి నాయకత్వం.. వాస్తవాలను అంచనా వేసి.. కొంచెం కిందకు దిగితే.. రానున్న కార్పోరేషన్‌ ఎన్నికల్లో రాజమండ్రిలో పార్టీ విజయం సాధిస్తుంది.. లేనిపక్షంలో నాలుగో సారీ.. కార్పోరేషన్‌లో మేయర్‌ పీఠాన్ని తెలుగుదేశం,జనసేన వంటి ప్రతిపక్షాలు తన్నుకుపోతాయి.

Comment here