Andhra PradeshEast GodavariNews

సూర్య ప్రకాశానికి.. గ్రహణమా?

సూర్య ప్రకాశానికి.. గ్రహణమా?
`మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు విషయంలో దారుణమైన వైఖరి
`సొంత పార్టీలోని వారే..వెన్నుపోటు పొడిచినా..వేటు న్యాయమా?
`రాజమండ్రి నగరాభివృద్దిలో..తనదైన ముద్ర
`నగరంలోని అన్ని డివిజన్లలోనూ.. జనాదరణ కల్గిన నాయకుడు
`అయినా..తగిన ప్రాధాన్యత ఇవ్వని..సిఎం జగన్‌
`రాజమండ్రి వైసిపిలో..ఆగని అంతర్గత విభేదాలు
`ఇప్పటికీ పూర్తి స్థాయి కో`ఆర్డినేటర్‌ను నియమించలేని దుస్థితి
`ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల మధ్య ఆధిపత్య పోరులో నలిగిపోతున్న పార్టీ శ్రేణులు
`ఇప్పటికే రెండుగా చీలిన వైసిపి
`గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్‌ వైవి.సుబ్బారెడ్డి చేసిన సర్దుబాటు నిలిచేనా?
గోదావరి జిల్లాల్లో కీలక నగరం.. రాజమహేంద్రవరంలో వైసిపి పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఎంపి భరత్‌, ఎమ్మెల్యే రాజాల మధ్య ఆధిపత్య పోరు.. కో`ఆర్డినేటర్‌ను నియమించలేని దుస్థితి.. సీనియర్‌ నేతలపై పూర్తిగా నిర్లక్ష్యం..గందరగోళంలో పార్టీ శ్రేణులు..క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉందో లేదో అర్థం కానీ పరిస్థితి..భవిష్యత్తులో చేదు ఫలితాలను చవిచూడాల్సి వస్తుందన్న సంకేతాలను పంపిస్తున్నాయి. వీటిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం.(జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి, రాజమహేంద్రవరంÑ ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో.. తూర్పుగోదావరి జిల్లాకు.. అందునా రాజమహేంద్రవరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో త్వరితగతిన అభివృద్ది చెందుతున్న నగరంగా.. వాణిజ్య రాజధానిగా.. చారిత్రక నగరంగా పేరు గాంచిన ఈ నగరంలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలో ఎప్పుడూ..గందరగోళమే. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కార్పోరేషన్‌లో కూడా తెలుగు దేశం ముచ్చటగా మూడో సారి సత్తా చాటి..మేయర్‌ పీఠాన్ని కైవశం చేసుకుంది. అయినా..అప్పట్లో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మేయర్‌ పంతం రజనీ శేషసాయి..మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల మధ్య అంతర్గత విభేదాలు..టిడిపిలో వేడి వేడిగా ఉండేవి. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి అర్భన్‌, రూరల్‌ నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. దీనికి కారణం.. స్థానికంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సాగిన అంతర్గత కుట్రలు. ఈ కుట్రలకు బలయిపోయింది.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు రౌతు సూర్య ప్రకాశరావు. సొంత పార్టీ నేతలే.. రౌతు పరాజయానికి కారకులన్నది..ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు తెలుసు.రౌతు పరాజయానికి ఎవరు కారకులన్నది.. వైసిపి అధిష్టానానికి తెలియకుండా ఉండే అవకాశమూ లేదు. సిఎం జగన్‌కు ఆ స్థాయిలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఉండదనుకోవడమూ సరికాదు. ఈ విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. రౌతుపై వైసిపి అధినాయకత్వం వేటు వేసింది. ఆ తర్వాత ఆయన పట్ల పూర్తిగా ఉదాసీన వైఖరినే ప్రదర్శిస్తూ వస్తోంది. ఆ తర్వాతైనా పార్టీ ఏమైనా గాడిన పడిరదా అంటే.. ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా….ఇప్పటికీ నగర కో`ఆర్డినేటర్‌గా స్థిరమైన నాయకుడిని నియమించలేని దుస్థితి. ఎన్నికల తర్వాత ఏపిఐఐసి మాజీ చైర్మన్‌ శిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యాన్ని కో`ఆర్డినేటర్‌గా నియమించారు. ఆయన తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి.. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసారు.నగరంలో వైసిపి బలోపేతానికి పునాదులు పడుతున్నాయని అంతా భావిస్తున్న తరుణంలో.. హఠాత్తుగా శిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం రాజీనామా చేసేసారు. శివరామ సుబ్రహ్యణ్యం రాజీనామా నిర్ణయం వెనుక.. బలమైన కారణాలు ఉన్నప్పటికీ అవి బయటకు రాలేదు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉంటూనే ఉన్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు కో`ఆర్డినేటర్‌గా నియమించారు. ఈయన అయినా.. పార్టీని గాడిలో పెట్టి నడిపిస్తారా ? అనుకుంటే పదవిని చేపట్టిన నాటినుంచే.. తన వివాదాస్పద ప్రవర్తనతో అటు పార్టీలోనూ.. ఇటు నగర వాసుల్లోనూ అభాసు పాలయ్యారు. పార్టీలో గ్రూపులు.. కులాల వారీగా కుంపట్లు ..పెరిగాయన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆకుల సత్యనారాయణ కూడా ఎక్కువ కాలం చురుగ్గా పనిచేయలేకపోయారు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేరా? అన్నట్లు కనిపించకుండా పోయారు. ఈ తరుణంలో నగరంలో పార్టీ.. చుక్కాని లేని నావలా తయారైంది.
రౌతుకు… తీరని అన్యాయం
రాజమండ్రి నగరాన్ని తన పదేళ్ల పదవీ కాలంలో..తన చేతనైనంత స్థాయిలో అభివృద్ది చేసారు..మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. రెండు సార్లు శాసన సభ్యుడిగా.. టిటిడి బోర్డు సభ్యుడిగా..ఆయన ప్రజలకు విశేష సేవలందించారు. దివంగత సిఎం మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అభిమానాన్ని చూరగొన్న నాయకుల్లో.. రౌతు సూర్య ప్రకాశరావు ఒకరు. వైఎస్‌ సంపూర్ణ మద్దతుతో… మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్‌, అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహన రావుల సహకారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు వాంబే గృహాలను నిర్మించి..అందించారు. నగరంలోని ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారానికి.. ఆర్యాపురం నల్లా చానల్‌ వద్ద మోటార్లను ఏర్పాటు చేసారు. దీనివల్ల వర్షాలు, వరదల సమయంలో ఆర్యాపురం, దేవిచౌక్‌, మూలగొయ్యి వంటి ప్రాంతాలు ముంపు బారిన పడకుండా చేయగల్గుతున్నారు. వీటితో పాటు నగరంలోని ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి రౌతు తనవంతు కృషిచేసారు. స్థానిక జాంపేట వద్ద వంతెనా, బాలాజీ పేట వద్ద ప్లైవోవర్‌.. అలాగే కాతేరు వద్ద గామన్‌ బ్రిడ్జి..వంటి నిర్మాణాలు.. రౌతు హయాంలోనే జరిగాయి. రామకృష్ణా ధియేటర్‌ వెనుక దేవాదాయ శాఖ భూముల్లో.. ఈనాడు ఒక చిన్న గ్రామమే ఏర్పడిరదంటే .. ఆనాడు రౌతు సూర్య ప్రకాశరావు చేసిన కృషేనని అందరూ ఒప్పుకుంటారు. నగరంలోని రోడ్లు,మౌలిక సదుపాయాల కల్పనలోనూ.. రౌతు శక్తి వంచన లేకుండా విశేష కృషి చేసారు. ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిమానాన్నే కాదు.. తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని, జనాదరణను చూరగొన్నారు.అటువంటి నాయకుడి విషయంలో.. ప్రస్తుతం వైసిపి అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు.. అత్యంత దారుణంగా ఉందని పార్టీలోని పలు వర్గాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరిని కలుపుకుని పోయో రౌతు.. అందరి వాడుగా.. జననేతగా పేరుపొందారు. కేవలం ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రనా.. రౌతు వంటి సీనియర్‌ నాయకుడిని పక్కన పెట్టడం సరికాదని రాజకీయ విశ్లేషకులు పేర్కోంటున్నారు. రౌతుకు సముచిత స్థానం ఇస్తే.. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న పార్టీ పరిస్థితి తిరిగి గాడిన పడే అవకాశాలు మెరుగవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రౌతుకు జరుగుతున్న అన్యాయంపై ఆయన అభిమానులు, వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వారు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి అధిష్టానం వ్యవహార శైలితో పాటు.. స్థానికంగా పరిస్థితులపైనా మండిపడుతున్నారు.
గ్రహణం వీడుతుందా?
రాజమండ్రి నగరంలో ప్రస్తుతం పార్టీని నడిపించగల సత్తా ఉన్న నాయకులు పెద్దగా ఎవరూ కనిపించడం లేదు. త్వరలో నగర పాలక సంస్థ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది కాకపోతే.. వచ్చే ఏడాదైనా కార్పోరేషన్‌ ఎన్నికలు ఖాయం. ఇటువంటి తరుణంలో.. నగరంలో కో` ఆర్డినేటర్‌ను కూడా నియమించుకోలేని దుస్థితిలో వైసిపి అధినాయకత్వం ఉంటే.. పార్టీ గెలవడం ఖాయం. ఇటీవల స్థానిక రౌతు తాతాలు కల్యాణ మండపంలో రౌతు సూర్య ప్రకాశరావు అనుచర వర్గం.. పార్టీలో సీనియర్‌ నేతలు సమావేశం నిర్వహించారు. రౌతుకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. సిఎం జగన్‌..రౌతు వంటి సీనియర్‌ నాయకుడి విషయంలో తగిన న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే.. తమ ఆవేదన, నిరసన వ్యక్తం చేసారు. ఎంపి భరత్‌..ఎమ్మెల్యే రాజాల మధ్య ఇటీవల వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జీ వైవి.సుబ్బారెడ్డి రాజీ చేసారని ప్రచారం సాగుతోంది. ఈ సఖ్యత ఎంతవరకు ఉంటుందో.. ఎంపి, ఎమ్మెల్యే వర్గాలకే తెలియాలి. ఇప్పటికైనా.. రౌతు వంటి నాయకుడికి తగిన ప్రాధాన్యత కల్పించి.. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోకపోతే.. రానున్న ఎన్నికల్లో వైసిపి తగిన మూల్యం చెల్లించక తప్పదు. మరి.. వైసిపి అధిష్టానం.. సిఎం జగన్‌ ఏం చేస్తారో వేచి చూడాలి.

Comment here