Andhra PradeshEast GodavariNews

హితకారిణి సమాజం మాజీ కార్యదర్శి మృతి

హితకారిణి సమాజం మాజీ కార్యదర్శి మృతి
రాజమహేంద్రవరం :
హితకారిణి సమాజం మాజీ కార్యదర్శి, తొలితరం వామపక్ష నాయకుడు గరికిపాటి వెంకట నారాయణ రావు (86) బుధవారం ఉదయం గుండెపోటుతో రాజమహేంద్రవరంలో మృతిచెందారు. కృష్ణా జిల్లాలోని నాగాయ తిప్పలో 1935లో జన్మించిన ఆయన గత 50 సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడ్డారు. విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలంవైపు ఆకర్షితులైన ఆయన తన జీవిత కాలాన్ని సామాజిక సేవకే అంకితం చేసారు. పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన రష్యాతో పాటు పలు కమ్యూనిస్టు దేశాల్లో పర్యటించారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడిగా, యునైటెడ్‌ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యూసీపీిఐ) జాతీయ కార్యదర్శి, నాగార్జున విశ్వ విద్యాలయం సెనేట్‌ మెంబర్‌గా పనిచేసారు. రాజమహేంద్రవరం హితకారిణి సమాజం కార్యదర్శిగా, ప్రకాశం నగర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ డైరెక్టర్‌గా, రాజమహేంద్రవరం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడిగా సేవలు అందించారు. గరికపాటికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మంగాదేవి పదేళ్ల క్రితమే మృతిచెందారు. ఆయన భౌతిక కాయానికి గురువారం రాజమహేంద్రవరంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Comment here