Andhra PradeshEast GodavariNews

శిరోముండనం కేసు విచారణ నిష్పక్షపాతంగా చేయాలి

శిరోముండనం కేసు విచారణ నిష్పక్షపాతంగా చేయాలి
తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి..
` వెంకటాయపాలెం శిరోముండనం దళిత ఐక్య పోరాట వేదిక
రాజమహేంద్రవరం :
ఎస్సీల ఓట్లతో నెగ్గిన ప్రభుత్వం దళితులను తీవ్రంగా అవమానపరచిన తోట త్రిమూర్తులును వెంటనే పార్టీ నుండి తొలగించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వెంకటాయపాలెం శిరోముండనం దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 1996లో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం 4గురు యువకుల శిరోముండనం కేసులో ఎ1 ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ఖచ్చితంగా దళితులను అవమానించడమేనని వారు పేర్కొన్నారు. తోట త్రిమూర్తులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ కేసు విచారణ జరగకుండా గత 25 సంవత్సరాలుగా అధికార అండతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ కో కన్వీనర్లు ఇసకపట్ల రాంబాబు, రేవు నాగేశ్వరరావు, మనోహర్‌, కన్వీనర్‌ వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు తోట త్రిమూర్తులుపై ఉన్న కేసును ఎత్తివేయగా దివంగత హైకోర్టు న్యాయవాది బొజ్జా తారకం హైకోర్టులో ప్రభుత్వ జి.ఓను రద్దు చేయించారన్నారు. అప్పటి నుండి విచారణను అడ్డుకుంటూ వచ్చి విచారణ ప్రారంభమై విచారణ జరుగుచున్న సమయంలో బాధితుల కులధృవీకరణ పత్రాలు కోర్టు రికార్డుల్లో మాయమవ్వటం, కోర్టు సిబ్బందిని నామ్‌కహా సస్పెండ్‌ చేయడం జరిగిందన్నారు. కోర్టు బాధితుల కులధృవీకరణ పత్రాలను మరలా ధృవీకరించి పంపవలసినదిగా సంబంధిత తహశిల్దార్‌ని ఆదేశించడం జరిగిందని, బాధితులకు కులధృవీకరణ పత్రాలు ఇచ్చే సమయానికి బాధితులు క్రిస్టియన్‌ మతంలోకి మారినట్లుగా ఉన్న రికార్డులను చూసి ఐక్య పోరాట వేదిక దిగ్భ్రాంతికి గురై జరిగిన విషయంపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని విచారణ చేయగా బాధితులకు తెలియకుండా అవన్నీ తప్పుడుగా తయారుచేసినట్టుగా జిల్లా జాయంట్‌ కలక్టర్‌ కోర్టులో రుజువులు చూపించామన్నారు. ఆ కుటుంబం ఎస్సీలుగా ధృవీకరణపత్రం ఇవ్వాల్సిందిగా తహశిల్దార్‌కి ఆదేశాలు ఇచ్చారన్నారు. సదరు తహశిల్దార్‌ జారీ చేసిన సర్టిఫికెట్లు కోర్టులో అందచేసే సమయానికి కేసులోని సాక్షుల విచారణ ముగియడంతో అండ్‌ సెక్షన్‌ 311గా కోర్టులో పిటిషన్‌ ద్వారా బాధితుల కుల ధృవీకరణ పత్రాలు వేయగా కోర్టు ఆ పిటీషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 14వ తేదీన డిస్మిస్‌ చేసి అక్టోబర్‌ 5వ తేదీకి ఆర్గ్యుమెంట్‌ను వాయిదా వేసిందన్నారు. డిస్మిస్‌ అయిన పిటీషన్‌ను పి.పి. ద్వారా హైకోర్టులో అప్పీలు చేయడానికి అందజేయగా సదరు హైకోర్టు పి.పి. అప్పీలు చేయడానికి వివిధరకాల ఒత్తిడుల వలన ఆలస్యం చేయడంతో కండీషన్‌తో ఈ కేసులను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసారని తెలిపారు. హైకోర్టు పిపి ఇన్‌టైమ్‌లో అప్పీలు చేయకపోవడం, ఆ తరువాత దసరా సెలవులు రావడంతో కేసు నెంబరు అవ్వకపోవడంతో బాధితులకు అన్యాయం జరిగి నిందితుడు శిక్షనుండి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా ఐక్య వేదిక అభిప్రాయపడుతుంది. సిఎం జగన్మోహన్‌ రెడ్డిని ఓట్లేసి గెలిపించిన దళితుల వెంట నిలుస్తారో లేక దళితులను శిరోముండనం చేసిన ముద్దాయి త్రిమూర్తులు వెంట నిలుస్తారో తేల్చుకోవాలని డిమాండ్‌ చేసారు. నేర చరిత్ర, భూ కుంభకోణాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వడంతోనే దళిత ద్రోహిగా జగన్‌ను భావిస్తున్నామని తెలిపారు. దళితులకు ఇప్పటికైనా సరైన న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వైసిపికి సరైన గుణపాఠం చెప్పడంతో పాటు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఎస్సీల ఓట్లతో నెగ్గిన ప్రభుత్వం దళితులను తీవ్రంగా అవమానపరచిన తోట త్రిమూర్తులును వెంటనే పార్టీ నుండి తొలగించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కో కన్వీనర్‌ నక్కా వెంకట రత్నం రాజు, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comment here