Uncategorized

ఏం సెప్పితిరి..ఏం సెప్పితిరి!… న ‘బూతో’.. నా భవిష్యత్తు!

ఏం సెప్పితిరి..ఏం సెప్పితిరి!… న ‘బూతో’.. నా భవిష్యత్తు!
`ఆర్యాపురం బ్యాంకులో ఆధిపత్యం కోసం విఫల యత్నం
`అవాస్తవాలు..పొంతన లేని విషయాలతో భజన పత్రికలో కథనం
`51 ఎంక్వైరీ.. రిజర్వ్‌ బ్యాంకు వేస్తుందటా!
`2013 ఎన్నికలలో ఎవరిపై పోటీ చేసారో కూడా తెలియక పోతే ఎలా?
`ప్రత్యేకాధికారి సబ్‌ కలెక్టర్‌ పనితీరునే శంకించేలా ఆరోపణలు
`ఆర్యాపురం బ్యాంకు మూలాలను దెబ్బతీసే కుట్రలు
`2002లోనే ఆర్యాపురం బ్యాంకుకు ‘‘ఎ’’ గ్రేడు
`తమ హయంలోనే ‘‘ఎ’’ గ్రేడు వచ్చిందని చల్లా వారి డప్పు ప్రచారం
`చల్లా పాలకవర్గం దిగిపోయిన తర్వాత… సి గ్రేడుకు పడిపోయిందంటా!
`ఆందోళనలో డిపాజిట్‌ దారులంటూ..రాతలు
`51 ఎంక్వైరీలో నిందితుల.. నీతి పాఠాలు
చింత చచ్చినా..పులుపు చావకపోవడం అంటే ఇదేనేమో!… ఆర్యాపురం బ్యాంకులో చైర్మన్‌ గిరికి కాలం చెల్లినా.. ఇంకా ఎందుకో ఈ పాకులాట. మీడియా సమావేశంలో ఏది పడితే అది మాట్లాడటం.. ఐఏఎస్‌ అధికారులపైనే అనుమానాలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం..సిగ్గుచేటు. 51 ఎంక్కైరీతో తమ పాలక వర్గంపై పడిన మచ్చను చెరిపేసుకోవడానికి.. శత వసంతాల బ్యాంకుపై బురద జల్లే ఆ పెద్దాయన ప్రయత్నాలు.. నవ్వుల పాలవుతున్నాయి. తన భజన పత్రికలో..అవాస్తవాలను వండి వార్చిన కథనంపై.. నిజాలను ప్రజలకు తెలియచెప్పేందుకే కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి,రాజమహేంద్రవరంÑ నవ్వి పోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది.. రాజమండ్రిలోని కొంతమంది పెద్ద మనుషుల తీరు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం.. స్వప్రయోజనాల కోసం ఏది పడితే అది మాట్లాడటం..తమకు బాకా ఊదే మీడియాలోనూ.. పత్రికల్లోనూ తప్పుడు కథనాలను రాయించుకోవడం..నయా జమానాలో రాజకీయ నాయకులకే కాదు.. కొందరు ప్రముఖులకు అలవాటుగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏకంగా పచ్చగా ఉండే వాటిపై..తప్పుడు ప్రచారం చేయడం దారుణం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రాజంమండ్రిలో శత వసంతాల చరిత్ర కల్గిన ప్రతిష్టాత్మక ది. ఆర్యాపురం కో`ఆపరేటివ్‌ అర్భన్‌ బ్యాంకు దివాళా తీస్తుందంటూ.. ఇటీవల మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ బ్యాంకుకు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా పనితీరునే విమర్శించేలా మీడియా సమావేశంలో విపరీత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలతో నగరంలోని పార్టీలకు అతీతంగా.. రాజకీయ నాయకులు, ప్రముఖులు విస్తుపోయారు. రెండు రోజుల క్రితం జ రిగిన ఆర్యాపురం బ్యాంకు సర్వసభ్య సమావేశంలోనూ.. తన అనుచర గణంతో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశంలో చల్లా శంకర్రావు పాలకవర్గంలోనే పనిచేసిన..యెనుముల రంగబాబు,ముళ్ల మాధవ్‌, నందం కుమార రాజా తదితరులు బ్యాంకు దివాళా తీస్తుందనడం సరికాదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే బ్యాంకు సీనియర్‌ సభ్యులు, మాజీ పాలక వర్గ సభ్యులు కూడా అయినా.. లంక సత్యనారాయణ, యజ్జవరపు మరిడయ్య, యాళ్ల కుమార స్వామి, కొల్లిమళ్ల రఘు తదితరులు.. చల్లా శంకర్రావు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటువంటి విపరీత వ్యాఖ్యలతో బ్యాంకు ఖాతాదారులు, డిపాజిట్‌ దారుల్లో ఆందోళన నెలకొంటుందన్న చర్చ సాగుతోంది. ఇటువంటి తరుణంలో మరోసారి చల్లా శంకర్రావుపై ఈగ కూడా వాలనివ్వని ఓ పత్రికా యజమాని.. ఓ అద్భుత కథనాన్ని వండి వార్చారు.
వాస్తవాలకు మసి పూసి..
నిజానికి రాజమండ్రిలోని ది. ఆర్యాపురం కో`ఆపరేటివ్‌ అర్భన్‌ బ్యాంకు ఎంతో ఘన చరిత్రతో.. సుమారు లక్ష మంది ఖాతాదారులు, డిపాజిట్‌ దారులతో.. వందల కోట్ల టర్నోవర్‌ కల్గి ఉంది. ఏపి సహకార రంగంలో.. కార్పోరేట్‌ బ్యాంకులకు ధీటుగా అభివృద్ది చెందిన బ్యాంకు. అటువంటి ఆర్యాపురం బ్యాంకుకు 2002లోనే ‘ఎ’ గ్రేడును రిజర్వ్‌ బ్యాంకు ఇచ్చింది. మాజీ సిఈఓ సివి. సుబ్రహ్మణ్యం ఆర్యాపురం బ్యాంకు అభివృద్దిలో కీలక భూమిక పోషించారు. తన పదవీ కాలంలో.. బ్యాంకును అన్ని వర్గాలకు చేరువ చేసి.. ప్రగతి పథంలో నడిపించారు. ఇక ఈ బ్యాంకుకు చైర్మన్‌లుగా చేసిన నగర ప్రముఖులు కూడా బ్యాంకు ఆర్థిక కార్యకలాపాల్లో.. శృతి మించి జోక్యం చేసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. అటువంటి బ్యాంకుకు 2013లో ఎన్నికలను నిర్వహించగా.. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు బలపర్చి.. ఇదే చల్లా శంకర్రావును చైర్మన్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న యజ్జవరపు మరిడయ్య వంటి మాజీ డైరెక్టర్లు రౌతు నిలబెట్టిన చల్లా శంకర్రావు బెల్ట్‌ను గెలిపించడానికి పనిచేసారు. ఆనాడు వైసిపిలో ఉన్న లంక సత్యనారాయణ… చల్లా శంకర్రావు ప్రత్యర్థిగా పోటీ చేసారు. ఈ విషయాలు తెలుసో..తెలియదో కానీ.. ఆ వేళ పత్రికలో యజ్జవరపు మరిడయ్యపై పోటీ చేసి గెలిచినట్లు రాసేసారు. 2013లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చల్లా శంకర్రావు పాలక వర్గం.. బ్యాంకులో కర్ర పెత్తనానికి బరితెగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకును ఆర్‌బిఐ నిబంధనలకు అనుగుణంగా…సమర్థవంతంగా నడిపిస్తున్న అప్పటి సిఈఓ సివిఎస్‌ సుబ్రహ్మణ్యం ఉంటే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఆయన్ను సాగనంపేందుకు కొదరు కుట్రలు పన్నారన్న ప్రచారమూ ఉంది.
ఈ నేఫథ్యంలోనే తమ అడ్డగోలు పనులకు అడ్డుతగులుతున్నారన్న కారణంగా సిఈఓ సుబ్రహ్మణ్యంని ఇరుకున పెట్టడానికి.. బ్యాంకుపై 51 ఎంక్వైరీ వేయించాడానికి.. కొందరు ప్రయత్నాలు సాగించారు. దీంతో అప్పట్లో నాటి ప్రభుత్వం.. బ్యాంకుపై 51 ఎంక్వైరీకి ఆదేశించింది. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఆర్యాపురం బ్యాంకుపై 51 ఎంక్వైరీ విచారణ అంటే.. ప్రజలు, ఖాతాదారులు ఆందోళన చెందుతారని గ్రహించిన సిఈఓ సుబ్రహ్మణ్యం.. తనకున్న పరిచయాలతో ప్రభుత్వానికి వాస్తవాలను వివరించి.. విచారణ నిలుపుదల చేయించారని తెలుస్తోంది. ఈ కుట్ర ఎవరు చేసారో నగరంలోని పెద్దలకు, బ్యాంకు మాజీ పాలక వర్గ సభ్యులకు బాగా తెలుసు. అంటే..ఎవరినో ఇరికిద్దామని చేసిన ప్రయత్నం.. భస్మాసుర హస్తంగా మారి..చివరికి చల్లా శంకర్రావు పాలకవర్గంపైనే పడిరదన్న మాట. 51 ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది.. కానీ చల్లా వారి భజన పత్రికలో మాత్రం ఆర్‌బిఐకి ఆర్‌టిఐ ద్వారా ఫిర్యాదులు చేస్తే.. ఆర్‌బిఐ వేసిందన్నట్లు రాయడం.. అవగాహనా రాహిత్యమే. ఇక మరొక ముఖ్య విషయం.. ఆర్యాపురం బ్యాంకులో ప్రస్తుతం పనిచేస్తున్న సిఈఓలు, మేనేజర్ల చేతుల్లో చెక్‌ పవర్‌ ఉంటుందని రాసేసారు. ఇది పూర్తిగా అబద్దం. ఇలా.. తమకు ఎలా తోస్తే అలా.. అవాస్తవాలను వండి వార్చి.. ఆర్యాపురం బ్యాంకు సర్వనాశనం అయిపోతుందని
రాయడం.. లేదా రాయించుకోవడం.. చాలా పెద్ద నేరం. ఎందుకంటే.. ఈ తప్పుడు తడకల కథనాలు చదివి..ఎవరైన డిపాజిట్‌ దారులు.. సీనియర్‌ సిటీజన్లు అఘాయిత్యాలకు పాల్పడితే.. ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నది సదరు పెద్ద మనుషులే చెప్పాలి.
సబ్‌ కలెక్టర్‌ గారూ..చర్యలు తీసుకుంటారా?
ఆర్యాపురం అర్భన్‌ బ్యాంకు ప్రస్తుతం ప్రత్యేకాధికారి సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా పర్యవేక్షణలో.. సజావుగా నడుస్తోంది. వందల కోట్ల టర్నోవర్‌ కల్గిన ఈ బ్యాంకుకు చల్లా శంకర్రావు పాలకవర్గం హయాంలోనే.. గతంలో ఎన్నడూ లేనంత చెడ్డపేరు వచ్చింది. బ్యాంకు డిపాజిట్లు.. వ్యాపారం పెంచి ఉండవచ్చు.. వివిధ జిల్లాల్లో బ్యాంకు శాఖలను విస్తరించి ఉండవచ్చు. టర్నోవర్‌ పెరిగి ఉండవచ్చు. ఇలా అభివృద్ది మాటున..ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు బలంగా వెల్లువెత్తాయి. బ్యాంకును తమ ఎస్టేట్‌గానూ.. జగీర్ధార్‌గానూ.. భావించి ఇష్టారీతిగా కర్రపెత్తనం చెలాయించారన్న వాదన ఉంది. వీరి నిర్వాకాల వల్లే.. చివరికి బ్యాంకుపై గతంలో వేసిన 51 ఎంక్వైరీ తిరిగి విచారణలోకి వచ్చింది.సుమారు 22 అభియోగాలకు సంబంధించి.. ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి విచారణ జరిపి.. సుమారు ఆరున్నర కోట్ల రూపాయలను చెల్లించాలని.. లేని పక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందించింది. 51 ఎంక్వైరీ తేల్చింది.. అభియోగాలు మాత్రమే అనడం.. ఘనత వహించిన చల్లా శంకర్రావు బృందానికే చెల్లింది. 51 ఎంక్వైరీలో నిందితులుగా ఉన్నవారు సైతం.. నీతి పాఠాలు వల్లించడం సిగ్గుచేటు. ఆర్యాపురం బ్యాంకుకు కేవలం తాను మాత్రమే రక్షకుడిగా ప్రచారం చేసుకోవడం.. మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావుకే చెల్లింది. ఈ అతి నుంచే.. ఏకంగా సబ్‌ కలెక్టర్‌ వంటి ప్రత్యేకాధికారుల పాలనలో.. బ్యాంకు సర్వనాశనం అయిపోతుందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మరీ..ఈ పైత్యంపై ప్రత్యేకాధికారి సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా..ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Comment here